Begin typing your search above and press return to search.

తప్ప తాగి.. పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేసేసింది

By:  Tupaki Desk   |   28 Jun 2016 10:27 AM GMT
తప్ప తాగి.. పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేసేసింది
X
తప్ప తాగటమే పెద్ద తప్పు. ఒకవేళ తాగినా తన దారిన తాను తాగుతూ ఇంట్లో కూర్చుంటే అదో పద్ధతి. అందుకు భిన్నంగా.. పూటుగా తాగేసి రోడ్డు మీదనో.. మరో చోటనో నానా రచ్చ చేస్తూ అందరిని ఇబ్బంది పెట్టటం ఏ మాత్రం క్షమార్హం కాదు. ఇదే ఎక్కువంటే.. ముంబయిలోని ఒక యువతి తప్ప తాగి చేసిన రచ్చ చూసినోళ్లంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి.

జూన్ 16న చోటు చేసుకున్న ఈ ఘటనలోకి వెళితే.. తన స్నేహితులతో కలిసి కారులో వెళుతున్న ఒక యువతి అప్పటికే పూటుగా తాగింది. తాగి డ్రైవ్ చేయటం నేరమైనప్పటికీ పట్టించుకోని ఆమె ర్యాష్ డ్రైవింగ్ చేసి.. రోడ్డు మీద వీరంగమే వేసింది. పట్టుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఫుల్ పాత్ మీద కారును ఎక్కించిన ఉదంతం గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమెతో పాటు.. ఆమె స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

స్టేషన్ కు తీసుకురావటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె అరుపులు.. కేకలతో నానా హడావుడి చేసింది. పోలీస్ స్టేషన్లో సామాగ్రిని చెల్లాచెదురు చేస్తూ రచ్చ చేసింది. ఆమెను కంట్రోల్ చేయటం ఆమె స్నేహితులకు సాధ్యం కాలేదు. ఆమె చేసిన హంగామాను ఒక పోలీసు మొబైల్ లో వీడియో తీశారు. తనను అడ్డుకుంటున్న పోలీసులపై ఆమె దౌర్జన్యం చేయటమే కాదు.. ఒక పోలీసులు చెంపను లాగి పెట్టికొట్టింది. ఇదంతా కెమేరాలో రికార్డుఅయ్యింది. అనంతరం స్నేహితులు గట్టిగా ప్రయత్నించటం ఆమె శాంతించింది. ఆమె చర్యను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి.. ఒక రోజు కస్టడీలో ఉంచారు. అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఆమె చేసిన విధ్వంసం మొత్తం ఆన్ లైన్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.