Begin typing your search above and press return to search.

ఫుల్ గా తాగేసి ఇద్దరు పోలీసుల్ని గుద్దేసిన మందుబాబులు

By:  Tupaki Desk   |   28 March 2021 7:30 AM GMT
ఫుల్ గా తాగేసి ఇద్దరు పోలీసుల్ని గుద్దేసిన మందుబాబులు
X
హైదరాబాద్ లోని నిజాంపేటలో దారుణం చోటు చేసుకుంది. మందుబాబుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేందుకు తరచూ డ్రంకెన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని వివిధ కమిషనరేట్లకు చెందిన పోలీసులు. శనివారం రాత్రి అదే తీరులో నిజాంపేటలో నిర్వహించారు. పోలీసుల తనిఖీల్ని తప్పించుకునేందుకు ఇద్దరు మందుబాబులు వ్యవహరించిన తీరుతో పోలీసుల ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఒకేరోజు చోటు చేసుకున్న ఈ రెండు ఉదంతాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. మందుబాబులు గుద్దేసిన కారణంగా గాయాలపాలైన వారిలో ఏఎస్ఐ ఒకరు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

శనివారం రాత్రి నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ లో భాగంగా కుకటపల్లి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే మార్గంలో వెళుతున్న సృజన్ అనే యువకుడు దుర్మార్గంగా వ్యవహరించారు. తనిఖీల్ని తప్పించుకోవటానికి తన కారును వేగంగా తీసుకెళుతూ మరో కారును ఢీ కొట్టాడు. మళ్లీ కారును వెనక్కి తీసుకొని ముందుకు వెళ్లే క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డును ఢీ కొట్టాడు. దీంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి.

అలెర్టు అయిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొన్నారు. పరీక్షలు చేయగా అతనికి 170 రీడింగ్ వచ్చింది. అతడు ప్రయాణిస్తున్న క్రెటా కారుకు డ్యామేజ్ జరిగింది. దీంతో సృజన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ సమాచారాన్ని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అందించారు. పెంట్రోలింగ్ మొబైల్ లో ఘటనాస్థలానికి చేరుకున్నారు ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి. అసలేం జరిగిందన్న వివరాల్నిట్రాఫిక్ పోలీసుల్నిఅడిగి తెలుసుకునే క్రమంలో.. తనిఖీల్ని తప్పించుకునేందుకు మరో మందుబాబు తన వాహనాన్ని వేగంగా నడుపుతూ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డిని గుద్దేశారు.

దీంతో.. ఆయన తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఏఎస్ఐను కొండాపూర్ కిమ్స్ కు తరలించారు. అదే సమయంలో ఒకేలాంటి నేరాలకు పాల్పడిన సృజన్.. అస్లాంలను అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలించిన ఏఎస్ఐ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. బాధ్యతగా విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని.. పూటుగా మందుతాగి.. వారికి థమ్కీ ఇవ్వాలన్న దారుణ ఐడియా.. ఇప్పుడు ఒక పోలీసు అధికారి ప్రాణాల కోసం పోరాడే పరిస్థితి. మందు తాగి దారుణమైన తప్పులకు పాల్పడిన వీరిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.