Begin typing your search above and press return to search.

డ్రంకెన్ డ్రైవ్ లో పెదాలు పగిలేలా సీఐను కొట్టిన మందుబాబు

By:  Tupaki Desk   |   9 Aug 2021 4:52 AM GMT
డ్రంకెన్ డ్రైవ్ లో పెదాలు పగిలేలా సీఐను కొట్టిన మందుబాబు
X
హైదరాబాద్ మహానగరంలో అనూహ్య ఘటన ఒకటి జరిగినట్లుగా చెబుతున్నారు. బయటకు రాని ఈ ఉదంతంలో పోలీసు అధికారిపై ఒక మందుబాబు విరుచుకుపడటమే కాదు.. దారుణంగా కొట్టిన వైనం షాకింగ్ గామారినట్లు చెబుతున్నారు. పోలీసులు బయటకు వెల్లడించని ఈ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చగా మారింది. అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికి.. పోలీసు వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతోంది. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ లో ఈ దాడి ఘటన జరిగిందని చెబుతున్నారు. మాదాపూర్ లోని ఎన్ఐఎ కార్యాలయం వద్ద రేంజ్ రోవర్ కారు అటువైపు వేగంగా వెళుతోంది. దాన్ని ఆపేందుకు పోలీసు సిబ్బంది ప్రయత్నించారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్న విషయాన్ని గుర్తించిన సదరు కారు.. ఆపకుండా రివర్స్ తీసుకొని వెళ్లటాన్ని అక్కడున్న పోలీసులు చూశారు. వెంటనే అప్రమత్తమైన వారు వాహనాల్ని అడ్డు పెట్టి అడ్డుకున్నారు. దీంతో.. కారు ఆపాల్సి వచ్చింది.

కారులో ఉన్న వారికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ప్రయత్నిస్తే వారు అందుకు అంగీకరించలేదు. తమనే ఆపుతారా? మీరెంత? మీ చదువులెంత? ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయి? అంటూ బెదిరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. అక్కడున్న పోలీసు సిబ్బందితో గొడవ పడిన వారు.. అక్కడే ఉన్న సీఐ పై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పెదవి పగిలినట్లుగా తెలుస్తోంది. విధులకు ఆటంకం కలిగించటమే కాదు.. తనపై దాడికి పాల్పడిన ఇద్దరు యువకుల మీద సదరు సీఐ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. పోలీసు అధికారిపై దాడి చేసిన ఇద్దరిలో ఒకరు సివిల్కాంట్రాక్టర్ కాగా.. మరొకరు డాక్టర్ గా చెబుతున్నారు. వీరిలో ఒకరు పోలీసు శాఖలో పని చేసే సీనియర్ అధికారి బంధువుగా ప్రచారం సాగుతోంది. దీంతో నిందితుల్ని కాపాడేందుకు పోలీసు అధికారులుప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకూ సీఐ ఇచ్చినట్లుగా చెబుతున్న ఫిర్యాదును కేసుగా నమోదు చేశారా? నిందితుల్ని అరెస్టు చేశారా? లేదా? లాంటి విషయాల్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.