Begin typing your search above and press return to search.

వేటు వేయాల‌న్న క‌విత వ్యాఖ్య‌పై డీఎస్

By:  Tupaki Desk   |   27 Jun 2018 9:20 AM GMT
వేటు వేయాల‌న్న క‌విత వ్యాఖ్య‌పై డీఎస్
X
గ‌డిచిన కొద్ది నెల‌లుగా నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అంత‌ర్గ‌త విభేదాలు ఈ రోజు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. పార్టీ సీనియ‌ర్ నేత పార్టీని నాశ‌నం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా ఎంపీ క‌విత ఆరోపించ‌టం తెలిసిందే. డీఎస్ పై వీలైనంత త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ అధినేత కేసీఆర్‌కు జిల్లా పార్టీ అధ్యక్షురాలి చేత విన‌తిప‌త్రాన్ని పంప‌టంతో జిల్లా రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది.

ఒక సీనియ‌ర్ నేత‌పై కేసీఆర్ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రు ఈ స్థాయిలో విరుచుకుప‌డ‌టం ఇదే తొలిసారి. గ‌తంలో టీఆర్ఎస్ లో విభేదాలు వ‌చ్చినా.. అవ‌న్నీ అధినేత కేసీఆర్ తో నెల‌కొన్న పంచాయితీలే కానీ.. కుటుంబ స‌భ్యుల‌తో ఉన్న‌వి కావు. దీనికి భిన్నంగా తాజాగా మాత్రం ఎంపీ క‌విత‌కు.. డీఎస్ ఫ్యామిలీకి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా.. త‌న‌పై వేటు వేయాలంటూ క‌విత నేతృత్వంలోని కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానించ‌టంపై డీఎస్ రియాక్ట్ అయ్యారు. క‌విత అండ్ కో మాదిరి కాకుండా సింఫుల్ గా నో కామెంట్ అన్న ఆయ‌న‌.. త‌న‌కు వ్య‌తిరేకంగా జిల్లా నేత‌లు ఎందుకు అలాంటి నిర్ణ‌యం తీసుకున్నారో త‌న‌కు తెలీద‌న్నారు.

సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోవాల‌న్న డీఎస్‌.. నేత‌లు అన్న‌ది కంప్లైంట్ మాత్ర‌మే క‌దా.. గొంతు కోస్తామ‌ని చెప్ప‌లేదు క‌దా? అంటూ వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. త‌న రాజ‌కీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా.. తానున్న పార్టీకి వ్య‌తిరేకంగా ఏనాడు ప‌ని చేయ‌లేద‌న్నారు. ఇంత‌కీ.. క‌విత‌కు.. డీఎస్‌కు ఎక్క‌డ చెడింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నిజామాబాద్ జిల్లా నేత‌లు చెబుతున్న మాట‌ల్ని చూస్తే.. టీఆర్ ఎస్ లో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌టం లేద‌ని డీఎస్ పార్టీ మారాల‌ని అనుకుంటున్న‌ట్లుగా గ‌డిచిన కొంత‌కాలంగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా డీఎస్ కుమారుడు ఒక‌రు బీజేపీలో చేర‌గా.. మ‌రొక‌రు తండ్రితో పాటే ఉన్నారు. ఆయ‌న‌కు స‌ముచిత స్థానం ఇవ్వాల‌ని డీఎస్ కోరుతున్నా.. ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఇదిలాఉండ‌గా.. ఈ మ‌ధ్య‌న డీఎస్ ను ఉద్దేశించి క‌విత ఒక స‌మావేశంలో మాట్లాడుతూ.. గ‌తి లేక‌నే డీఎస్ త‌మ పార్టీలోకి వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్యానించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇది డీఎస్ ను బాధించిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రోవైపు.. డీఎస్ సామాజిక వ‌ర్గానికి చెందిన కుల నేత‌లు.. ముఖ్య‌మంత్రిస్థాయి ఉన్న మీరు టీఆర్ఎస్ లోకి వెళ్ల‌టం ఏమిటంటూ నిల‌దీసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇవే.. డీఎస్‌.. క‌విత‌ల‌కు మ‌ధ్య దూరాన్ని పెంచాయ‌ని చెబుతున్నారు. ఒక‌వైపు డీఎస్ వైపు వేటు వేయాల‌ని క‌విత కోరుతున్న వేళ‌.. త‌న కుమారుడితో క‌లిసి డీఎస్ భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.