Begin typing your search above and press return to search.

#పొగ‌మంచు: ఢిల్లీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం

By:  Tupaki Desk   |   10 Nov 2017 1:06 PM GMT
#పొగ‌మంచు: ఢిల్లీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం
X
దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా ప్రాంతాలు వాయుకాలుష్యంతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. మంచు, వాహ‌నాల నుంచి వెలువ‌డే పొగ‌, హరియాణా, పంజాబ్ ల‌లో రైతులు పాత గడ్డిని కాల్చ‌డం వ‌ల్ల వాయు కాలుష్య స్థాయి సాధార‌ణం క‌న్నాతీవ్ర‌మైంది. గాలిలో నాణ్యత తీవ్ర స్థాయిలో తగ్గిపోయింది. హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించే స్థాయికి ఢిల్లీలో ప‌రిస్థితులు దిగ‌జారాయి. పొగ‌మంచు కార‌ణంగా చాలామంది రోడ్డు ప్ర‌మాదాల‌కు గురై గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. దీంతో, వాయు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. రోడ్లపై వాహనాల ర‌ద్దీని నియంత్రించడానికి కేజ్రీవాల్ స‌ర్కార్ ఐదు రోజుల పాటు సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. ప్ర‌జ‌ల‌ను ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వైపు ఆక‌ర్షించేందుకు ఆ విధానం అమ‌లులో ఉన్న‌ సమయంలో డీటీసీ, క్ల‌స్ట‌ర్ బ‌స్సుల్లో ప్రయాణాన్ని కూడా ఉచితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఆ 5 రోజులు డీటీసీ - క్ల‌స్ట‌ర్ బ‌స్సుల్లో ఉచిత ప్రయాణ వ‌స‌తిని క‌ల్పిస్తున్నామ‌ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్ తెలిపారు. ఆ విధానం ద్వారా రోడ్డు మీద వాహనాల సంఖ్యను, కాలుష్యాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంద‌న్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకూ ఆ ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం అమల్లో ఉంటుందన్నారు. ఉచిత ప్రయాణ సౌక‌ర్యంతో బ‌స్సులు కిట‌కిట‌లాడే అవ‌కాశ‌ముండ‌డంతో మరో 600బస్సు స‌ర్వీసుల‌ను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ‌తంలో ఈ విధానాన్ని అమలు చేసిన‌పుడు కాలుష్య స్థాయి కొంత వ‌ర‌కు త‌గ్గింది. దీంతో, మూడోసారి స‌రి బేసి ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌తిరోజు ఉద‌యం 8గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఈ విధానం అమ‌లులో ఉంటుంది. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా పబ్లిక్‌ ట్రాన్స్ పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్‌ ఛార్జీలను కూడా నాలుగు రెట్లు పెంచింది.

మ‌రోవైపు కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ‌తంలో సరి-బేసి విధానం అమలు చేసిన‌పుడు వాయు నాణ్య‌త ఎంత వ‌ర‌కు మెరుగుప‌డిందో తెలియ‌జేయాలంటూ కేజ్రీవాల్ స‌ర్కార్ ను ఎన్జీటీ చైర్ ప‌ర్స‌న్ స్వ‌తంత్ర కుమార్ ఆదేశించారు. తాజాగా ఈ సరి బేసి విధానం అమ‌లు చేయ‌డానికి గల కార‌ణాల‌ను వివ‌రిస్తూ నివేదిక సిద్ధం చేయాల‌ని చెప్పారు. ఈ స‌రిబేసి విధానం వ‌ల్ల వాహ‌నాల నుంచి వెలువ‌డే కాలుష్యం త‌గ్గ‌న‌ట్లుగా ఎటువంటి డేటా లేద‌ని ఎన్టీటీకి సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ గ‌త సంవ‌త్స‌రం ఏప్రిల్ 21న తెలిపింది. ఈ విధానం వ‌ల్ల పెద్ద‌గా ప్రయోజనం లేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నివారణ మండళ్లు గ‌తంలో నివేదిక ఇచ్చినా మ‌ళ్లీ ఎందుకు అమలు చేస్తున్నారో తెల‌పాల‌ని ప్ర‌భుత్వాన్ని ఎన్జీటీ కోరింది.