Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌తో దుబాయ్ నిండిపోయిందిగా.. !

By:  Tupaki Desk   |   15 Sep 2022 11:30 PM GMT
ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌తో దుబాయ్ నిండిపోయిందిగా.. !
X
క‌రోనా మ‌హ‌మ్మారితో దాదాపు రెండేళ్ల‌కు పైగా ప్ర‌పంచం గుప్పిట్లో బందీ అయింది. ఎక్క‌డిక‌క్క‌డ క‌రోనా భ‌యంతో అన్ని వ్య‌వ‌స్థ‌లు మూసుకుపోయాయి. ముఖ్యంగా ప్ర‌పంచ ప‌ర్యాట‌క రంగం అయితే.. మ‌రింతగా తాళం వేసుకునే ప‌రిస్థితి. ఏ న‌లుగురు గుమిగూడినా.. పెను ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉండ‌డంతో ప‌ర్యాట‌కుల‌కు ఏ దేశం కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే.. ఇప్పుడిప్పుడే.. ప్ర‌పంచం క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డుతోంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా తాజాగా వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ప‌ర్యాట‌కులు.. ఒకింత సేద‌దీరేందుకు.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న దేశాల‌వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో ఇప్పుడు దుబాయ్ అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న దేశంగా ముందుంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర్యాట‌కులు పెద్ద ఎత్తున ఈ ఎడారి దేశానికి క్యూ క‌డుతున్నారు.

ఈ ఏడాది తొలి ఆరు నెల‌ల్లోనే దుబాయ్‌కి ప‌ర్యాట‌క ఆదాయం ఏకంగా 40 వేల కోట్ల రూపాయ‌లు స‌మ‌కూరింద‌ని.. అధికారికంగా వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి ప‌ర్యాట‌కులు ఏ రేంజ్‌లో ఈ దేశానికి క్యూక‌ట్టారో తెలుస్తుంది.

ఇదే కాలంలో హోట‌ళ్ల‌లో దిగిన అతిథులు కూడా 1.2 కోట్ల‌కు చేరార‌ని.. ఇది 42 శాతం పెరుగుద‌ల న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. ఈ శీతాకాలంలో ప‌ర్యాట‌క రంగం మ‌రింత ముందుకు సాగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు దుబాయ్ పాల‌కుడు షేక్ మెహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తూమ్ వెల్ల‌డించారు.

మ‌రోవైపు.. ఈ ఏడాది న‌వంబ‌రు, డిసెంబ‌రు మాసాల్లో ఫిఫా వ‌రల్డ్ క‌ప్ కు ఖ‌తార్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. దీంతో ప‌ర్యాట‌కుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత బిజీ విమానాశ్ర‌యాల్లో దుబాయ్ ఒక‌టి. ఈ విమానాశ్ర‌యం నుంచి ఈ ఏడాది తొలి ఆరు నెల‌ల కాలంలో 27.8 మిలియ‌న్ల (2.70 కోట్ల‌) ప్ర‌యాణికులు రాక‌పోక‌లు సాగించారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. దుబాయ్‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ అత్యంత వేగంగా సాగ‌టంతోపాటు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌టమేన‌ని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు క‌రోనా నుంచి విముక్తి క‌లుగుతుండ‌డంతో ప్ర‌పంచ ప‌ర్యాట‌క ప్రేమికులు ఊపిరి పీల్చుకుంటున్నార‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.