Begin typing your search above and press return to search.

వీడిన ఉత్కంఠ: శ్రీ‌దేవి మృత‌దేహం త‌ర‌లించేందుకు లైన్ క్లియ‌ర్‌

By:  Tupaki Desk   |   27 Feb 2018 10:12 AM GMT
వీడిన ఉత్కంఠ: శ్రీ‌దేవి మృత‌దేహం త‌ర‌లించేందుకు లైన్ క్లియ‌ర్‌
X
గ‌త మూడురోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. శ్రీదేవి మృత‌దేహాన్ని తీసుకువెళ్లేందుకు ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. శ్రీదేవి మృత‌దేహాన్ని ఎంబామింగ్ (మృతదేహం పాడవకుండా చేపట్టే రసాయన ప్రక్రియ)కు తీసుకువెళ్లేందుకు అనుమ‌తి ద‌క్కింది. క్లియ‌రెన్స్ లెట‌ర్‌ ను దుబాయ్ పోలీసులు ఇవాళ జారీ చేశారు. ఆ లేఖ‌ను బోనీక‌పూర్‌ తో పాటు ఇండియ‌న్ కాన్సులేట్‌ కు అంద‌జేశారు. దాదాపు 40 గంట‌ల పాటు శ్రీదేవి మృత‌దేహం మార్చురీలోనే ఉంది. ఎంబామింగ్ పూర్తి అయిన త‌ర్వాత ఆమె మృత‌దేహాన్ని ముంబైకి త‌ర‌లిస్తారు.

దుబాయ్‌ లోని ముహెస్నా ఎంబామింగ్ యూనిట్‌ లో శ్రీదేవి శ‌రీరానికి ఎంబామింగ్ చేస్తారు. జుమైరా ఎమిరేట్స్ హోట‌ల్‌ లో శ‌నివారం రాత్రి శ్రీదేవి మృతిచెందిన విష‌యం తెలిసిందే. మొద‌ట ఆమె కార్డియాక్ అరెస్ట్‌ తో మృతిచెందిన‌ట్లు అనుమానించారు. కానీ శ్రీదేవి ప్ర‌మాద‌వ‌శాత్తు బాత్‌ ట‌బ్‌ లో ప‌డి మృతిచెందిన‌ట్లు దుబాయ్ ఫోరెన్సిక్ అధికారులు త‌మ డెత్ రిపోర్ట్‌ లో స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత కేసు దుబాయ్ ప్రాసిక్యూష‌న్‌ కు బ‌దిలీ చేశారు. ఇవాళ దుబాయ్ కాల‌మానం ప్ర‌కారం 12.45 నిమిషాల‌కు శ్రీదేవి మృత‌దేహం త‌ర‌లింపున‌కు నో ఆబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ జారీ చేశారు. శ్రీదేవి డెడ్‌ బాడీని తీసుకువెళ్లేందుకు ఆమె కుటుంబ‌స‌భ్యులు మార్చురీకి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ఆంబులెన్స్ ద్వారా త‌ర‌లించి అనంత‌రం విమానంలో ముంబైకి తీసుకువ‌స్తారు.

ఇదిలాఉండ‌గా..ఆమె మ‌ర‌ణం విష‌యంలో ఒకింత వివాదం రూపం దాల్చుతోంది. శ్రీదేవి బాత్‌ టబ్‌ లో ప్రమాదవశాత్తు పడి మృతిచెందినట్లు దుబాయ్ ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు. కానీ సామాజిక రచయిత తస్లీమా నస్రీన్ తన ట్విట్టర్‌ లో చేసిన పోస్టులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. శ్రీదేవి మృతి పట్ల ఆమె మరికొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన యువత ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌ లో పడరని ఆమె సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు.

అంతకుముందు అదే రోజు ఉదయం కూడా శ్రీదేవి డెత్ మిస్టరీపై తస్లీమా మరో ట్వీట్ చేశారు. శ్రీదేవి మృతదేహాం పూర్తి నీటితో నిండి ఉన్న బాత్‌ టబ్‌ లో దొరికిందని - బహుశా అది హత్యో - ఆత్మహత్యా కాదనుకుంటా అని ఆమె ట్వీట్ చేశారు. అయితే శ్రీదేవి మృతిపై తస్లీమా అనవసర వదంతులు సృష్టిస్తున్నారని - తన స్వంత వ్యాఖ్యానాలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇదిస‌రైన విధానం కాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రోవైపు లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్.. లేడీ సూపర్‌ స్టార్ శ్రీదేవికి అద్భుతమైన నివాళి అర్పించింది. తన చూపులతో దేశం మొత్తాన్ని కట్టిపడేసిన ప్రియా.. మంచి సింగర్ అన్న విషయం కూడా తెలిసిందే కదా. అందుకే ఓ మాంచి పాటతో శ్రీదేవికి ఆమె నివాళి అర్పించిది. కభి అల్విద న కెహనా.. అంటూ ప్రియా ఓ ట్వీట్ చేసింది. చరిత్ర ఎప్పుడూ గుడ్‌ బై చెప్పదని, మళ్లీ కలుస్తా అనే అంటుందని ఆ ట్వీట్‌ లో ప్రియా రాసింది. అయితే శ్రీదేవి మృతదేహం అప్పగింతపై జరిగిన డ్రామాలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపైనా ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. సరైన సమాచారం లేకుండా ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మరో ట్వీట్‌ లో ప్రశ్నించింది.