Begin typing your search above and press return to search.

ఈ ఫైన్ ముందు.. భ‌ర‌త్ అనే నేను టుమ్రీ!

By:  Tupaki Desk   |   9 Aug 2018 3:49 PM GMT
ఈ ఫైన్ ముందు.. భ‌ర‌త్ అనే నేను టుమ్రీ!
X
ఈ మ‌ధ్య‌న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన భ‌ర‌త్ అనే నేను మూవీ గుర్తుంది? ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం రూల్స్ ను బ్రేక్ చేసే వాహ‌న‌దారుల‌పై రూ.పాతిక వేలు.. రూ.50వేల చొప్పున ఫైన్ వేయ‌టం చాలామందిని ఆక‌ట్టుకుంది. ప్రాక్టిక‌ల్ గా ఇలాంటి ప‌ని చేస్తే.. ఒక్క ఓటు కూడా రాదు క‌దా.. ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోతుంద‌న్న మాట‌లు మాట్లాడినోళ్లు చాలామందే ఉన్నారు.

క్ర‌మ‌శిక్ష‌ణ రావాల‌న్నా.. రూల్స్ ను బుద్దిగా ఫాలో కావాల‌న్నా.. ప‌టిష్ఠ‌మైన చ‌ట్టం ఉండాల్సిందే. క‌ఠిన నిబంధ‌న‌లు కష్టంగా ఉన్నా.. ఒక‌సారి అల‌వాటైతే.. అవెంత బాగుంటాయ‌న్న‌ది విదేశాల‌కు వెళ్లే వారిని అడిగితే చెబుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో ఇష్టారాజ్యంగా వాహ‌నాల్ని న‌డిపే వారిలో విదేశాల‌కు వెళ్లి వ‌చ్చినోళ్లు ఉంటారు.

అక్క‌డేమో బుద్ధిగా రూల్స్ ను ఫాలో అయ్యే వాళ్లు.. ఇక్క‌డ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఎందుకిలా అని అడిగితే.. అక్క‌డ తేడా చేస్తే.. భారీ ఫైన్ ప‌డుతుంద‌ని.. ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంద‌ని భ‌యం భ‌యంగా చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ఒక ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసే వారికి దిమ్మ తిరిగిపోవ‌ట‌మే కాదు.. జీవితంలో త‌ప్పు చేయాల‌న్న ఆలోచ‌న రావ‌టానికి సైతం భ‌య‌ప‌డేలా ఫైన్లు ఉండాల‌నే దానికి త‌గ్గ‌ట్లుగా ఈ ఉదంతం ఉంది.

దుబాయ్ లో చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా అమ‌లు చేస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. రూల్స్ ను బ్రేక్ చేయ‌టానికి వారు స‌సేమిరా అంటుంటారు. అయితే.. ఒక విదేశీ ప్ర‌యాణికుడు దుబాయ్ చ‌ట్టాల్ని తేలిగ్గా తీసుకొని అడ్డంగా బుక్ అయ్యాడు. దుబాయ్ కు వ‌చ్చిన బ్రిటిష్ ప‌ర్యాట‌కుడు స్థానిక చ‌ట్టాలు తెలీక త‌న లంబోర్గి కారును వాయు వేగంతో న‌డిపాడు.

దీనికి అత‌గాడికి అధికారుల నుంచి శ్రీ‌ముఖం అందింది. అందులో వేసిన ఫైన్ మొత్తం చూసిన ప‌ర్యాట‌కుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంత‌కీ.. ఆ ఫారిన్ టూరిస్ట్ కు అక్క‌డి అధికారులు వేసిన ఫైన్ ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.32 ల‌క్ష‌లు. ఈ భారీ జ‌రిమానా చూసిన 25 ఏళ్ల బ్రిటీష్ ప‌ర్యాట‌కుడు షాక్ తిన్నాడు.

టూరిస్ట్ వీసా మీద వ‌చ్చిన స‌ద‌రు బ్రిటీష్ పౌరుడు..లంబోర్గి హ‌రికేన్ సూప‌ర్ కార్ ను రెండు రోజుల‌కు అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.ల‌క్ష మొత్తాన్ని చెల్లించాడు. దుబాయ్ వీధుల్లో త‌న కారుతో చెల‌రేగిపోయాడు. రూల్స్ గురించి అవ‌గాహ‌న లేదో.. దుబాయ్ అధికారుల తీరు గురించి తెలీదో కాని.. న‌చ్చినట్లుగా కారు న‌డిపేశాడు. దీంతో.. రూల్స్ ను బ్రేక్ చేస్తూ కారును న‌డిపిన ప్ర‌తిసారీ జ‌రిమానా న‌మోదైంది. చివ‌ర‌కు త‌న కారును తిరిగి ఇచ్చే వేళ‌కు.. అయ్య‌గారి పేరు మీద రూ.32 ల‌క్ష‌ల ఫైన్ చిట్టా సిద్ధంగా ఉంద‌ట‌. దాని వివ‌రాలు చూసి.. స‌ద‌రు ప‌ర్యాట‌కుడి నోట మాట రాలేద‌ట‌. కారు అద్దెకు ఇచ్చేట‌ప్పుడు గ్యారెంటీ కోసం స‌ద‌రు ప‌ర్యాట‌కుడి పాస్ పోర్టును త‌మ ద‌గ్గ‌ర ఉంచుకుంద‌ట‌. ఇప్పుడీ ఫైన్ మొత్తాన్ని చెల్లించాల‌న్న మాట‌కు స‌ద‌రు ప‌ర్యాట‌కుడు షాక్ తిన్నాడ‌ట‌. అన‌క ల‌బోదిబోమంటున్నాడు. కొత్త ప్ర‌దేశానికి వెళ్లేట‌ప్పుడు అక్క‌డి రూల్స్ ను తెలుసుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి అన్న‌ది మ‌ర్చిపోవ‌ద్దు సుమా!