Begin typing your search above and press return to search.

వికాస్ దుబే 700 కి.మీ. ఎలా ప్రయాణించాడు: ప్రియాంక గాంధీ

By:  Tupaki Desk   |   9 July 2020 4:30 PM GMT
వికాస్ దుబే 700 కి.మీ. ఎలా ప్రయాణించాడు: ప్రియాంక గాంధీ
X
ఉత్తర ప్రదేశ్‌లో 8మంది పోలీసులను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో మాస్క్ పెట్టుకొని తిరుగుతుండగా సెక్యూరిటీ సిబ్బంది అతనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గురువారం అతనిని అరెస్ట్ చేశారు. కాన్పూర్‌లో ఈ ఘటన జరిగిన అనంతరం సదరు గ్యాంగ్‌స్టర్ ఏకంగా 700 కిలో మీటర్లు ప్రయాణించాడు.

రోడ్డు మార్గంలో హర్యానాలోని ఫరీదాబాద్, అక్కడి నుండి రాజస్థాన్ కోట మీదుగా ఉజ్జయిని చేరుకున్నాడు. అతను నేపాల్ పారిపోయాడని భావించిన తరుణంలో మధ్యప్రదేశ్‌లో పట్టుబడ్డాడు. ఇండో-నేపాల్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు వాహనాలను తనిఖీ చేశారు యూపీ పోలీసులు. అయితే అతను ఏకంగా సుదూరం ప్రయాణించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు.

ఎలాంటి తనిఖీ లేకుండా దూబే 700 కి.మీ.ప్రయాణించాడంటే ఆశ్చర్యంగా ఉందని, దారుణమైన ఎన్‌కౌంటర్‌ తర్వాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దూబే గురించి అప్రమత్తం చేయడంలో విఫలమయ్యిందని, అందువల్లే అతను‌ ఉజ్జయిని చేరుకోగలిగాడని, ఇది ప్రభుత్వ వైఫల్యాలనే కాక అతడికి గవర్నమెంట్‌తో గల సంబంధాలను సూచిస్తుందని ఆరోపించారు. అంతేకాదు, వికాస్ దుబేను అరెస్ట్ చేశారా లేక లొంగిపోయాడా వివరణ ఇవ్వాలని సమాజ్ వాది పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. అయితే కేసులో నిందితులు దొరకినప్పటికీ, కానీ కాంగ్రెస్, ఎస్పీ నేతలు అంతదూరం ఎలా ప్రయాణించాడని అడగడం విడ్డూరంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాము దుబేను అరెస్ట్ చేయలేదని, ఉజ్జయినిలో లొంగిపోయాడని, ఇంత పెద్ద ఘటన తర్వాత అతను బాహాటంగా తిరుగుతున్నాడని, దీనిపై దర్యాఫ్తు చేయాలని ఓ ఐపీఎస్ అధికారి ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి మాత్రం దుబెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాగా, రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్‌లో ప్రవేశించేందుకు నకిలీ ఐడీని ఉపయోగించాడు.