Begin typing your search above and press return to search.

అందుకే అద్వానీకి టికెట్ ఇవ్వ‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   22 March 2019 10:56 AM GMT
అందుకే  అద్వానీకి టికెట్ ఇవ్వ‌లేద‌ట‌!
X
వినేవాడు ఉంటే చెప్పేటోడు చెల‌రేగిపోతాడ‌ని ఊరికే అన‌రేమో. తాజాగా ప‌రిణామాలు చూస్తే.. ఈ మాట గుర్తుకు రావ‌టం ఖాయం. నిన్న రాత్రి బీజేపీ తొలి అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌టం.. అందులో బీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడిలో ఒక‌రైన లాల్ కృష్ణ అద్వానీకి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌టంతో పెను దుమారం రేగింది.

అద్వానీకి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే గాంధీ న‌గ‌ర్ ఎంపీ స్థానానికి అమిత్ షాను బ‌రిలోకి దించుతూ ప్ర‌క‌ట‌న చేయ‌టంపై క‌మ‌ల‌నాథుల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేనా.. అద్వానీకి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌టంపై సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున నిర‌స‌న వెల్లువెత్తుతోంది.

మీడియాలోనూ నెగిటివ్ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇలాంటివేళ‌..బీజేపీ ముఖ్య‌నేత‌లు అద్వానీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌టంపై క్లారిటీ ఇచ్చే పేరుతో క‌వ‌రింగ్ చేస్తున్న‌ట్లుగా చెబుత‌న్నారు. తాజాగా అద్వానీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌టంపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ స్పందించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా.. పార్టీ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెప్పారు. తాజా ఎన్నిక‌ల్లో అద్వానీకి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌టంతో ఆయ‌న రాజ‌కీయ జీవితానికి తెర ప‌డేలా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అయితే.. టికెట్ విష‌యంపై అద్వానీతో చ‌ర్చించిన త‌ర్వాతే పార్టీ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని గడ్క‌రీ వెల్ల‌డించారు. పార్టీ సీనియ‌ర్ గా అద్వానీ స‌దా ప్రేర‌ణ‌గా నిలుస్తార‌ని.. ఏ పార్టీలో అయినా స‌మ‌యానికి త‌గ్గ‌ట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయ‌ని చెప్పిన ఆయ‌న మాట‌లు అతికిన‌ట్లుగా లేవ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ అద్వానీకి పోటీ చేసే ఆలోచ‌నే లేకుంటే.. ఏదో ఒక సంద‌ర్భంలో ఆయ‌న ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించే వారు క‌దా?

అక్క‌డి వ‌ర‌కూ ఎందుకు జాబితా విడుద‌లకు ముందే త‌న పోటీపై క్లారిటీ ఇచ్చి.. త‌న‌కు విశ్రాంతి కావాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పే వారు క‌దా? అదేమీ లేకుండా అద్వానీ నోట మాట రానివ్వ‌కుండా.. ఆయ‌న మాట‌లు బ‌య‌ట‌కు విన‌ప‌డ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ నేత‌ల మాట‌లు ఉత్త క‌వ‌రింగే త‌ప్పించి ఇంకేమీ లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

వ‌య‌సు మీద ప‌డిన కార‌ణంగా అద్వానీ పోటీలో ఉండ‌న‌ని చెప్పార‌న్న‌దే నిజ‌మ‌ని అనుకుందాం. మ‌రి.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే గాంధీన‌గ‌ర్ సీటును అద్వానీ ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని అమిత్ షాను పోటీ చేయాల‌ని కోరార‌ని కూడా చెబుతారా? అంటూ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అద్వానీని పోటీలో లేకుండా చేసిన వైనంపై రానున్న రోజుల్లో మ‌రెన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో? ఏమైనా.. పార్టీకి కురువృద్ధుడైన అద్వానీ గౌర‌వానికి త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించి ఉంటే బాగుండేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.