Begin typing your search above and press return to search.

వైసీపీ సర్పంచ్ దెబ్బకు రామాలయానికి తాళం

By:  Tupaki Desk   |   6 April 2022 2:20 AM GMT
వైసీపీ సర్పంచ్ దెబ్బకు రామాలయానికి తాళం
X
చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏమైనా చేస్తామన్నట్లుగా ఉంటుంది కొందరి నేతల తీరు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీలో ఉందని చెబుతున్నారు. వైసీపీ నేతలు డిసైడ్ కావాలే కానీ.. ఏమైనా జరిగే పరిస్థితి నెలకొంది. ఈ తీరుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు.

వైసీపీ సర్పంచ్ కు కోపం రావటం.. ఆ వెంటనే రామాలయానికి తాళం పడిపోవటమే కాదు.. రెండు రోజులుగా స్వామివారికి జరగాల్సిన సేవలు జరగని పరిస్థితి నెలకొందంటున్నారు. రాజకీయ అధిపత్య పోరులో భాగంగా గుడికి తాళం పడటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఉదంతం ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని వట్టి చెరుకూరు మండలం కోవెలమూడిలో శ్రీరామ వేడుకల్ని నిర్వహించేందుకు రామాలయ కమిటీ సిద్ధమైంది. ఈ నెల పదిన జరిపే రాములోరి కల్యాణమహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు ఆయన పెద్దలు సిద్ధమయ్యారు. ఇందుకోసం కల్యాణ పందిరి కోసం కర్రను పాతారు.

అయితే.. ఈ వేడుకల్లో తనకు ప్రాధాన్యతను ఇవ్వకపోవటం స్థానిక సర్పంచ్ శ్రీనుకు కోపం వచ్చింది. ఆయన ఎంట్రీ ఇచ్చిన గ్రామానికి సర్పంచ్ ను తానేనని.. ఈ ఏడాది రాములోరి కల్యాణాన్ని తానే నిర్వహిస్తానని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివాదం చోటు చేసుకుంది.

గ్రామ సర్పంచ్ గా వ్యవహరిస్తున్న శ్రీను దంపతులు మొదట కల్యాణ తలంబ్రాలు పోసి.. ఆ తర్వాత మిగిలిన దంపతులు తలంబ్రాలు పోస్తారన్న పరిష్కారం కూడా సర్పంచ్ కు నచ్చ లేదు. దీంతో.. వివాదం ముదిరింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్.. రామాలయానికి తాళం వేయించారు.

తాళాల్ని పోలీసు స్టేషన్ లో ఉంచారు. దీంతో.. గడిచిన రెండు రోజులుగా స్వామి వారి ధూప దీప నైవైద్యాలకు వీల్లేకుండా పోయింది. ఒక సర్పంచ్ ఆగ్రహం దేవాలయానికి తాళం పడటం చుట్టుపక్కల గ్రామాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.