Begin typing your search above and press return to search.

స్టింగుఆపరేషన్ లో బుక్ అయిన పార్టీలు

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:00 AM GMT
స్టింగుఆపరేషన్ లో బుక్ అయిన పార్టీలు
X
మరో సంచలనం బయటకు వచ్చింది. రాజకీయ వర్గాలకు సుపరిచితమే అయినా ఈ విషయం స్టింగ్ ఆపరేషన్ రూపంలో ఒక మీడియాసంస్థ ప్రపంచానికి చూపించిన వైనం విస్తుపోయేలా ఉంది. ఎన్నికలు జరుగుతున్న వేళ.. తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల్ని ఓడించేందుకు వీలుగా డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దింపే వైనాన్ని కొన్ని చిన్న పార్టీలు ఒప్పేసుకోవటం.. ఇదంతా కెమేరా కంటికి దొరికిపోవటం విశేషం.

గుర్తింపు పొందని దాదాపు 1900 చిన్నా చితకా పార్టీలకు సంబంధించిన నిర్వాహకుల్లో కొందరిపై ఒక మీడియా సంస్థ కన్నేసింది. తమ ప్రత్యర్థులుగా ఫీలయ్యే పార్టీ అభ్యర్థుల్ని ఓడించేందుకు వీలుగా ఈ పార్టీలు వేసే ఎత్తుగడలు తాజాగా బయటకు వచ్చాయి. ఫలితాల్ని తారుమారు చేసేందుకు చిన్నస్థాయి రాజకీయ నేతలు డమ్మీ అభ్యర్థుల్ని ఎలా రంగంలోకి దింపుతారన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ కు చెందిన కొన్ని బుల్లి రాజకీయ పార్టీలు బయటపెట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకు తాము గడిచిన 14 ఏళ్లుగా డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దించుతున్నట్లుగా ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్ నేషనల్ కన్వీనర్ వసీ అహ్మద్ చెబుతూ కెమేరా కంటికి దొరికిపోయారు. ఈ పార్టీకి తోడుగా రాష్ట్రీయ అవామీదళ్ అనే మరో బుల్లి పార్టీ సైతం తాముకూడా ఇదే తరహా ఎన్నికల రాజకీయాన్ని చేస్తామని చెప్పుకొచ్చింది. డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దించినందుకు పార్టీకి కోటి రూపాయిలు.. అభ్యర్థికి రూ.10లక్షల్ని ప్రత్యేకంగా చెల్లించాలని చెప్పటం గమనార్హం. డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దించే అలవాటున్న యూపీకి చెందిన మరో పార్టీ ‘స్వరాష్ట్ర జన్’ ఇదే విషయాన్ని చెప్పి బుక్ అయ్యింది.

తమకు డబ్బులు ఇచ్చే వారి ప్రత్యర్థులకు పడే ఓట్లలో చీలిక తేవటమే లక్ష్యంగా డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించుతామని ఆ పార్టీ అధ్యక్షుడు రాజేశ్ భారతి చెప్పేశారు. ఇలా డమ్మీ అభ్యర్థుల్ని దించే పార్టీల్లో అప్నాదేశ పార్టీ కాస్త ఖరీదైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందంటూ స్టింగ్ ఆపరేషన్లో ఆ పార్టీకి చెందిన ఉస్మానీ నోరు జారేశారు. డమ్మీ అభ్యర్థుల అసలు గుట్టు బయటకు వచ్చిన వేళ.. చిన్న పార్టీల విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.