Begin typing your search above and press return to search.

100 ఏళ్ల క్రితం డూప్లెక్స్ ఇండ్లు.. ఇప్పటికీ చెక్కుచెదరని వైభవాలు

By:  Tupaki Desk   |   10 Jun 2022 2:30 AM GMT
100 ఏళ్ల క్రితం డూప్లెక్స్ ఇండ్లు.. ఇప్పటికీ చెక్కుచెదరని వైభవాలు
X
చెట్ల కింద నివాసం ఏర్పరుచుకుని బతికిన రోజుల నుంచి క్రమంగా.. గుడారాలు, పాకలు, పూరి గుడిసెలు, పెంకుటిళ్లు, మట్టి మిద్దెలు, డాబాలు, అపార్ట్మెంట్లు, డూప్లెక్స్లు ఇలా మనుషుల నివాసాలు క్రమంగా మారుతూ వచ్చాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో క్షణాల్లో ఇంద్ర భవనాలు కళ్లముందు వెలుస్తున్నాయి. కానీ ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో.. ఎటువంటి సౌకర్యాలు లేని కాలంలో.. వందేళ్ల క్రితమే డూప్లెక్స్లు నిర్మించారు. పూర్తి ప్రకృతి సిద్ధమైన మెటీరియళ్లతో నిర్మించిన ఈ డూప్లెక్స్లు వందేళ్లు గడిచినా.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ కుటుంబాల వారసులకు కానుకగా మిగిలాయి.

పాతతరం మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏడు పదుల వయసులోనూ చాలా మంది హుషారుగా ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్లంతా నలభై ఏళ్లకే వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. అలాగే ఇప్పుడు కడుతున్న భవనాలు, అపార్ట్మెంట్లు కూడా కాస్త వానకే కూలిపోవడం.. బీటలు వారడం వంటివి జరుగుతున్నాయి. కానీ పూర్వకాలంలో కట్టిన చాలా ఇళ్లు, భవనాలు, కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి.

పూరిగుడిసెలో మొదలుపెట్టిన మానవ ప్రయాణం ఇప్పుడు ఇంద్రభవనాల్లో లగ్జరీగా బతికే వరకు చేరింది. గుడిసెలు, గుడారాల నుంచి పెంకుటిళ్లు, డాబాలు, అపార్ట్మెంట్లు దాటి డూప్లెక్స్లకు చేరుకున్నాం. ఇప్పుడు డూప్లెక్స్ ఇండ్లు కట్టాలంటే ఆధునిక టెక్నాలజీలు, రకరాల సదుపాయాలున్నాయి. కానీ వందేళ్ల క్రితం ఇవేమీ లేవు. కేవలం ప్రకృతిలో లభించే మట్టి, ఇసుక, రాళ్లు వంటి వాటితో వందేళ్ల క్రితమే డూప్లెక్స్లు కూడా కట్టారు మన పూర్వీకులు. ఎన్ని వరదలు, తుపానులు, సునామీలు వచ్చినా.. అవి ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. ఆ నాటి పూర్వీకులు తమ వారసుల కోసం ప్రేమగా కట్టిన ఇండ్లు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి.

ప్రస్తుత డూప్లెక్స్‌ ఇంటిని మరిపించే నాటి నిర్మాణాన్ని పరిశీలిస్తే ప్రతి అంశం ప్రత్యేకంగా కనిపిస్తుంది. దాదాపు 200 నుంచి 300 గజాల స్థలంలో నిర్మించిన ఈ ఇండ్లు విశాలంగా, గాలి వెలుతురు చక్కగా వచ్చేలా ఉంటాయి. వీటిని నిర్మించడానికి కేవలం రాళ్లు, మట్టి, కర్రచెక్కలు మాత్రమే వినియోగించడం మరో విశేషం. గ్రామ సమీపంలోని చెరువులో బాగా మగ్గిన మల్లం మట్టిని తీసుకొచ్చి.. దాంట్లో నీరు పోసి రాత్రంతా బాగా తొక్కేవారు. ఆ తరువాత దానిని పెద్దపెద్ద ముద్దలుగా చేసి ఒకదానిపై ఒకదాన్ని పేర్చి గోడలుగా నిర్మించేవారు.

గోడలు పూర్తికాగానే తమ చేతి కళకు పని చెప్పే అప్పటి బేల్దార్లు చేతివేళ్ల సాయంతో గోడపై ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా నున్నగా చేసేవారు. మరి కొందరు రాళ్లతో నిర్మించేవారు. ఆ తరువాత పొడవాటి కర్రలు(దులాలు, వాసాలు) సాయంతో పైకప్పు వేసి వాటిపై మట్టిని నింపి కుమ్మరి పెంకులను పేరుస్తారు. నేల భాగం(గచ్చు) నుంచి పైకప్పునకు మధ్యలో చిన్నచిన్న కర్ర ముక్కలు(పరాట) పేర్చి ఇంటిని రెండంతస్తుగా సిద్ధం చేసేవారు.

తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా ఇలాంటి ఇండ్లు చాలా కనిపిస్తాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పాతకాలం నాటి డూప్లెక్స్ ఇండ్లు ఎక్కువ దర్శనమిస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున ఈ ఇండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని మనూరు, నాగల్‌గిద్ద, కల్హేర్‌, సిర్గాపూర్‌, ఖేడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌, మాయికోడ్‌, కారాముంగి, కరస్‌గుత్తి, శెల్గిర, మంగల్‌పేట, నాగ్‌దర్‌, న్యాల్‌కల్‌ తదితర గ్రామాల్లో అప్పట్లో పటేళ్లు, పట్వారీలు, మోతుబరులు నిర్మించుకున్నారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.