Begin typing your search above and press return to search.

కరుణానిధి నియోజకవర్గంలో నకిలీ ఈవీఎంలు

By:  Tupaki Desk   |   13 May 2016 8:30 AM GMT
కరుణానిధి నియోజకవర్గంలో నకిలీ ఈవీఎంలు
X
ఎలక్ర్టానిక్ ఓటింగు యంత్రాలపై ఇప్పటికే చాలామందికి అనుమానాలున్నాయి. వాటిని టాంపర్ చేయొచ్చని... ఎలాంటి ఫలితం కావాలంటే అలా మార్చుకోవచ్చని.. ఏ గుర్తుకు ఓటుపడేలా సెట్ చేస్తే అదే గుర్తుకు పడుతుందని.. ఇలా చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. అలాంటివి బలపడేలా చెన్నైలో ఏకంగా 500 నకిలీ ఈవీఎంలు దొరికాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పైగా ఇవి తమిళనాడు విపక్ష పార్టీ డీఎంకే అధినేత, మాజీ మంత్రి కరుణానిధి నియోజకవర్గంలో దొరకడంతో కలకలం రేగుతోంది.

ఎన్నికల వేళ, తమిళనాడులో ఏకంగా నకిలీ ఈవీఎం మెషీన్లను తయారు చేశారు. ఏకంగా రాజ్యాంగ వ్యవస్థనే నకిలీతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. తంజావూరు జిల్లాలోని తిరువారూర్ లో తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ఇవి తారస పడటంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో సంబంధమున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం స్టేషనుకు తరలించారు. వీరి వెనుక ఎవరున్నారు? ఎవరికి అనుకూలంగా ఓట్లను వేసుకోవాలన్నది వీరి ఆలోచన? వీటిని ఎలా అసలు ఈవీఎంల ప్లేస్ లలో పెట్టాలని అనుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. కాగా, తిరువరూర్ కేంద్రం నుంచి డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

తిరువారూర్ సీటుకున్న ప్రాధాన్యం నేపథ్యంలో అక్కడ వెలుగుచూసిన నకిలీ ఈవీఎంలు ఎన్నో అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఎలాగైనా గెలవాలని కరుణానిధి వర్గం ఈ పనిచేస్తుందా లేదంటే కరుణానిధిని ఎలాగైనా ఓడించాలని పాలక అన్నాడీఎంకే ఈ పనిచేసిందా అన్నది తేలాల్సి ఉంది.