Begin typing your search above and press return to search.

శ్రీవారి దర్శనానికి వెళ్లి.. అలా చేశారేంటి సీఎం రమేశ్?

By:  Tupaki Desk   |   28 Dec 2020 12:30 PM GMT
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. అలా చేశారేంటి సీఎం రమేశ్?
X
దేవుడి దర్శనానికి వెళ్లేది ఎందుకు? తన చుట్టూ ఉన్నోళ్ల సంగతి ఎలా ఉన్నా.. తానైతే బాగుండాలని.. తనను తన కుటుంబాన్ని చల్లగా చూడాలని.. వీలైతే.. తనకున్న ‘పవర్’ మరింత కాలం ఉండాలని.. మరింత పెరగాలని కోరుకోవటానికే కదా? అంత దానికి వివాదాల్లోకి ఇరుక్కోవటం ఎందుకు? సామాన్యులకు ఈ మర్మం అర్థం కాదు. కానీ.. ఘనత వహించిన రాజకీయ నేతలు మాత్రం తరచూ వివాదాలతో సహవాసం చేస్తుంటారు. తాజాగా అలాంటి పనితో ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్.

తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయన.. చేతికి యాపిల్ స్మార్ట్ వాచ్ తో వెళ్లి రావటం వివాదాస్పదంగా మారింది. టీటీడీ నిబంధనల ప్రకారం ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తీసుకొని ఆలయంలోకి వెళ్లకూడదు. అంతేకాదు.. ఏపీ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం.. అలా చేయటం నేరం కూడా. అయినప్పటికీ.. అదేమీ పట్టనట్లుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ను పెట్టుకొని స్వామి వారి దర్శనానికి వెళ్లారు.

అయితే.. సీఎం రమేశ్ చేతిలో ఉన్న స్మార్ట్ వాచ్ ను అక్కడి సిబ్బంది కూడా పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఆయన టీటీడీ నిబంధనల్ని అతిక్రమించారన్న ఆగ్రహం పలువురు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. దర్శనం ముగించుకున్న సీఎం రమేశ్ కు.. వేద పండితులు ఆశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇంతకూ తన తిరుమల దర్శనం ఎందుకో మీడియాకు వివరించారు సీఎం రమేశ్. యూకే నుంచి దేశానికి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. వారిలో కొత్త రకం వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని స్వామి వారిని కోరినట్లు చెప్పారు. అందరూ బాగుండాలని కోరుకున్న సీఎం రమేశ్.. ఆ తొందరలో తాను బాగుండాలని కోరుకోలేదా? లేకుంటే.. తాజా వివాదంలో ఆయన ఎందుకు చిక్కుకుంటారు చెప్మా?