Begin typing your search above and press return to search.

పాదయాత్ర వేళ మంత్రి చెల్లుబోయిన వ్యూహం చెల్లలేదట

By:  Tupaki Desk   |   22 Oct 2022 4:39 AM GMT
పాదయాత్ర వేళ మంత్రి చెల్లుబోయిన వ్యూహం చెల్లలేదట
X
ప్రతికూలతల్ని ఎదుర్కోవటం అంత తేలిక కాదు. అందునా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా..గళం విప్పుతూ నిర్వహించే కార్యక్రమాల విషయంలో 'పవర్' ఎంతలా పని చేస్తుందన్న విషయాన్ని ఇటీవల కాలంలో గుర్తిస్తున్నవారంతా నోరెళ్ల బెడుతున్నారు. ఇదే పద్దతి భవిష్యత్తులో మరింత పెరిగితే.. నోరు విప్పే అవకాశం ఉండదనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రజల మద్దతును పొందేందుకు ఏపీ రాజధానిగా 'అమరావతి'ని ప్రకటించాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ శుక్రవారానికి అమరావతి రైతులు పాదయాత్రను మొదలుపెట్టి నలభై రోజులు అవుతుంది. ఒక జిల్లాను దాటి మరో జిల్లాలోకి పాదయాత్ర ఎంటర్ అయిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక లొల్లి చోటు చేసుకోవటం.. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనటం రివాజుగా మారింది. శుక్రవారం సైతం అదే పరిస్థితి. రైతుల పాదయాత్రకు సవాళ్లు విసిరే విషయంలో అధికార పక్షం ఒకలా..

అధికారులు మరోలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం విషయానికి వస్తే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి పాదయాత్ర ఎంటర్ కావటం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం 600 మంది మాత్రమే పాదయాత్ర చేయాలని.. మిగిలిన వారంతా పాదయాత్ర లో పాల్గొనకుండా.. రోడ్డుకు ఇరువైపుల మాత్రమే నిలుచోవాలన్న నిబంధనను తెర మీదకు తీసుకురావటం.. దానికి సంబంధించిన లొల్లు కొన్ని గంటల పాటు సాగింది. ఇదిలా ఉంటే.. తమ జిల్లాలోకి ఎంటరైన పాదయాత్రకు షాకిచ్చేందుకు జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు.

మంత్రిగారి ఆదేశాల నేపథ్యంలో రామచంద్రాపురం నియోజకవర్గంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ వారు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపుల్ని మూసివేయాలని డిసైడ్ చేశారు. అందుకు తగ్గట్లే.. షాపులు మూసేశారు. ఇలా మూసివేసి ఉన్న షాపుల మధ్య నుంచి పాదయాత్ర సాగితే.. పేలవంగా సాగిందన్న ప్రచారం చేయాలన్నది మంత్రిగారి వ్యూహంగా చెబుతున్నారు. అయితే.. రూల్ బుక్ లోనిఅంశాలకు తగ్గట్లే పాదయాత్ర చేయాలే తప్పించి.. అంతకు మించి కుదరదన్న అధికారుల తీరుతో పాదయాత్ర ఆలస్యమైంది.

ఉద్రిక్తతలు సర్దుమణిగాక.. అధికారులు పాదయాత్రను రామచంద్రాపురంలోకి అడుగుపెట్టనిచ్చారు. అనూహ్యంగా అప్పటికి సాయంత్రం ఐదు గంటలు దాటేసరికి.. అన్ని షాపుల్ని ఓపెన్ చేశారు. దీంతో.. మంత్రిగారు కష్టపడి షాపుల్ని క్లోజ్ చేసేందుకు భారీగా వేసిన ప్లాన్ బెడిసికొట్టినట్లైంది. షాపులన్నీ తెరుచుకోవటం.. పాదయాత్రకు సంఘీభావంగా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు సాగటంతో పేలవంగా మార్చాలనుకున్న పాదయాత్ర అందుకు భిన్నంగా కళకళలాడిన పరిస్థితి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.