Begin typing your search above and press return to search.

మండలిలో కోట్లాట వేళ.. చంద్రబాబు ఎక్కడున్నారు?

By:  Tupaki Desk   |   18 Jun 2020 11:00 AM IST
మండలిలో కోట్లాట వేళ.. చంద్రబాబు ఎక్కడున్నారు?
X
ఏపీ శాసన మండలిలో బుధవారం అనూహ్య పరిణామాలుచోటు చేసుకోవటం తెలిసిందే. ఏపీ మంత్రులకు.. టీడీపీ ఎమ్మెల్సీలకు జరిగిన కోట్లాట అందరిని విస్మయానికి గురి చేసింది. అధికార.. విపక్షాల మధ్య మాటా మాటా అనుకోవటం.. ఉద్రిక్త పరిస్థితులుచోటు చేసుకోవటం మామూలే. అందుకు భిన్నంగా దూసుకెళ్లి దెబ్బ కొట్టాలని చూడటం.. దాన్ని నిలువరించే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవటం.. గాల్లోకి ఎగిరి కొట్టటం లాంటి విపరీత చర్యలు ఏపీ మండలిలో చోటు చేసుకున్నాయి.

మరి.. ఇదంతా జరిగిన సమయంలో విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ ఉన్నారు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికే క్రమంలో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. బుధవారం శాసన మండలి ప్రారంభం నుంచి నిరవధికంగా వాయిదా పడే వరకూ చంద్రబాబు తన ఛాంబర్ లోనే గడపటం గమనార్హం. అచ్చెన్న తదితర టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్టు చేసిన వైనంపై నిరసన వ్యక్తం చేస్తూ.. అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం ఆయన తన ఎమ్మెల్యేలతోపాటు తన ఛాంబర్ లోకి వెళ్లారు. కీలకమైన బిల్లులు మండలికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ జరిగే పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలించిన చంద్రబాబు.. మండలిలో జరిగే అంశాల్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ తగిన సలహాలు.. సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన కోట్లాట వేళలోనూ బాబు కొన్ని సూచనల్ని తమ్ముళ్లకు ఇచ్చినట్లుగా సమాచారం.ఏమైనా.. బాబు కనుసన్నల్లోనే గొడవ జరిగిందన్న అభిప్రాయాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.