Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ వేళ.. వారితో మీటింగ్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన ఈటెల

By:  Tupaki Desk   |   11 April 2021 4:16 AM GMT
సెకండ్ వేవ్ వేళ.. వారితో మీటింగ్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన ఈటెల
X
అంచనాలకు తగ్గట్లే తెలంగాణలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందన్న అంచనాలకు తగ్గట్లే కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రోజుకు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ ఇష్టారాజ్యంగా పెరిగినట్లుగా విమర్శలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఫ్యాప్సీలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కాగా.. నిజామాబాద్ కు చెందిన ఒక వ్యక్తి రెమిడెసివర్ మహారాష్ట్రంలో రూ.600 వసూలు చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం రూ.4వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపించారు.

ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రులు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి భారీ ఎత్తున వసూలు చేస్తున్న వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వారి ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఈటెల.. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని స్పష్టం చేయటంతో పాటు.. పేదలను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు.కేసులు పెరుగుతున్న వేళ.. పడకల సంఖ్యను పెంచుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారమే ఫీజులు తీసుకోవాలే కానీ.. ఇష్టారాజ్యంగా తీసుకోవద్దన్నారు.

ఒకవేళ అలా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికను సూటిగా చెప్పేశారు. వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే దోచుకుంటున్నారన్న భావన సాధారణ ప్రజల్లో ఉందని.. అలాంటి తీరును మార్చుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. తమకు అవసరమైన పరికరాలు.. ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరగా ఈటెల సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.

ప్రైవేటు వైద్య కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులకు కోవిడ్చికిత్సకు అవసరమైన మందుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తున్నందున.. సర్కారీ దవాఖానాల్లో మాదిరే ఆ ఆసుపత్రుల్లోనూ కోవిడ్ వైద్యం పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు. అందరూ మాస్కు పెట్టుకోవాలని.. అదే చేస్తే లాక్ డౌన్ కంటే ఎక్కువ ఎఫెక్టు ఉంటుందని ఈటెల చెప్పటం గమనార్హం.