Begin typing your search above and press return to search.

తెలంగాణ ఉద్యమం వేళ విగ్రహాలు కూల్చినప్పుడు ఈ గొంతులేమయ్యాయి?

By:  Tupaki Desk   |   25 May 2022 1:30 PM GMT
తెలంగాణ ఉద్యమం వేళ విగ్రహాలు కూల్చినప్పుడు ఈ గొంతులేమయ్యాయి?
X
న్యాయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దానికి కాలానికి తగ్గట్లు.. ప్రాంతానికి తగ్గట్లు.. జాతికి తగ్గట్లు తన తీరు మార్చుకోవటం ఉండదు కదా? మరి అలాంటప్పుడు.. దారుణం జరిగినప్పుడు భావోద్వేగమని నీతులు చెప్పినోళ్లకు.. గతంలో తాము చెప్పిన నీతుల్ని ఎందుకు మర్చిపోయినట్లు? అన్నది ప్రశ్న. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లా పేరు ముందు పెట్టాలన్న ఏపీ సర్కారుతో ఇప్పటివరకు లేని కొత్త రచ్చ మొదలైంది. నిజానికి ఆ పేరు పెట్టాలన్న ఆలోచనే ఉండి ఉంటే.. దాన్ని జిల్లా పేరును ప్రకటించిన సమయంలోనే ఎందుకు ప్రకటించలేదు? అన్నది ప్రశ్న. దానికి చెప్పే సమాధానం ఏమంటే.. వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేయటంతోనే జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టినట్లుగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.

ఒకవేళ నిజంగానే పేరు పెట్టే విషయం మీద జిల్లా ప్రజలకు అంత ఇష్టమే ఉంటే.. ఇంత పెద్ద నిరసన.. ఆందోళన ఎందుకు జరుగుతుంది? అన్నది ప్రశ్న. సరే..అప్పుడు పెట్టలేదు.. ఇప్పుడు పెడితే ఏమైంది? ఆయన ఏమైనా మామూలు వ్యక్తా?రాజ్యాంగ నిర్మాత అంటూ లెక్చర్లు ఇచ్చేటోళ్లు చాలామంది బయటకు వస్తున్నారు. ఇక్కడ ఎవరూ అంబేడ్కర్ ను కించపర్చటం లేదు. నిజమే.. ఆయన దేశంలోని ప్రజలందరి స్ఫూర్తిదాత. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టేందుకు అభ్యంతరం ఎందుకు? అనే వాళ్లకు.. అలాంటి పేరున్న పెద్ద మనిషి పేరును ఒక జిల్లాకు ఎందుకు పరిమితం చేయాలి? అంబేడ్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని ఎందుకు పెట్టకూడదు? అన్నది ప్రశ్న.

ఒక జాతీయ నేతను ఒక జిల్లాకు ఎందుకు పరిమితం చేయాలి? ఒక రాష్ట్రానికి ఎందుకు పెట్టకూడదు? నిజానికి ఒక్క అంబేడ్కర్ పేరునే కాదు..మహాత్మాగాంధీ..సుభాష్ చంద్రబోస్..లాలాలజపతిరాయ్.. భగత్ సింగ్ ఇలాంటి పేర్లను కూడా ఎందుకు పెట్టకూడదు? ఈ సందేహాల నడుమే కొన్ని పాత గురుతులు కూడా గుర్తుకు వస్తున్నాయి. తమ ప్రాంత ఉనికిని ప్రతిబింబించేలా ‘కోనసీమ’ పేరును యథాతధంగా ఉంచాలని డిమాండ్ చేయటం తప్పేం కాదు కదా? ఒక ప్రాంత ప్రజలకు వారికంటూ కొన్ని ఆశలు.. ఆకాంక్షలు ఉండటం తప్పేం కాదు కదా? తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిన సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి గురైన కొందరు ఆందోళనకారులు.. ట్యాంక్ బండ్ మీద ఉన్న తెలుగు ప్రముఖులకు ‘ప్రాంతాల’రంగు పూసి కూలదోసినప్పుడు ఇప్పుడు ‘మంచి’ గురించి మాట్లాడుతున్న నోళ్లు ఎందుకు తెరవ లేదు?అన్నది ప్రశ్న.

నిజానికి నాడు విగ్రహాలు కూల్చిన ప్రముఖులకు.. వారి కాలానికి ఆంధ్రా..తెలంగాణ అన్న తారతమ్యాలు కూడా ఉండి ఉండకపోవచ్చు. అలా ఏమీ తెలియని వారికి ప్రాంతాల రంగు పులిమేసి.. వారి విగ్రహాల్ని కూల్చేయటం అన్నది భావోద్వేగ చర్యగా అభివర్ణించి.. ఈ రోజున గోదారి వాళ్లు మంచోళ్లు.. ఇలా ఆందోళనలు చేసి మీకున్నమంచి పేరును చెడగొట్టుకుంటారా? అని నీతులు చెప్పటం ఎంతవరకు సబబు? ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేమంటే.. తమ ఆశలు.. ఆకాంక్షలకు సంబంధించి ఒక ప్రాంత ప్రజలు పోరాటం చేయటం తప్పేం కాదు.

కాకుంటే.. హింసాత్మకం అన్నది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో.. అంబేడ్కర్ పేరును ఎందుకు ఆమోదించరు? అంటూ ప్రశ్నించే హక్కు.. ఆ ప్రాంతానికి సంబంధం లేని వారికి లేదన్నది మర్చిపోకూడదు. ఎందుకంటే..వారికుండే అభ్యంతరాలు వారికి ఉండొచ్చు. నిజంగా అంత ప్రేమే ఉంటే.. ఇలాంటి మాటలు మాట్లాడే వారు వారి జిల్లాలకు కానీ.. ఊళ్లకు ముందు ఆ పేరు పెట్టాలని గళం విప్పితే సరిపోతుంది.ఇదంతా ఎందుకంటే.. అంబేడ్కర్ మీద అభిమానం లేక కాదు.

ఆయన పేరుతో కొందరు పెద్ద మనుషుల మాదిరి నీతులు చెప్పేందుకు ఆయన పేరును వాడేసుకోవటం మీదనే అభ్యంతరమంతా. ఒక ప్రాంతానికి సంబంధించిన భావోద్వేగాల్ని తమకున్న తర్కబుద్ధితో.. మేధోతనంతో ‘మంచి - చెడు’ అంటూ విభజన చేసే కన్నా.. మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా సాధ్యం కాదు.. మా గళాన్ని విప్పుతామని కరాఖండిగా చెప్పేటోళ్లు.. అన్ని విషయాల మీదా మాట్లాడాలి. ఒక దాని మీద ఒకలా.. మరో అంశం మీద మరోలా మాట్లాడటం కుదరదన్నది మర్చిపోకూడదు.