Begin typing your search above and press return to search.

ఇంద్రకీలాద్రిపై దసరా శోభ.. బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు

By:  Tupaki Desk   |   8 Oct 2021 10:30 AM GMT
ఇంద్రకీలాద్రిపై దసరా శోభ.. బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు
X
దసరా వచ్చేస్తోంది. సంబరాలు తెచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల రెండోరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి పలువురు వీఐపీలతోపాటు సాధారణ భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీబాల త్రిపుర సందరి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని మంత్రి గుమ్మనూరు జయరాం, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, సినీ నటి శ్రీయా దర్శించుకున్నారు.

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని.. అమ్మవారి ఆశీస్సులు అందరూ పైన ఉండాలని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. అమ్మవారిని బాలాత్రిపుర సుందరిదేవీగా దర్శించుకోవడం సకల శుభకరమని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. అందరూ అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

శుక్రవారం శ్రీబాలాత్రిపుర సందురీదేవీ అలంకారంలో ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటి శ్రీయ దర్శికుంచుకున్నారు. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి జయరాం కూడా దర్శించుకున్నారు. కరోనా నుంచి దూరమై అందరూ ఆనందంగా ఉండాలన్నారు. కార్మికులకు అన్ని సదుపాయాలు మా ప్రభుత్వం అందిస్తోందని జయరాం తెలిపారు.

నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవీ భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈరోజు రెండు నుంచి పది సంవత్సరాల లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.. అమ్మవారికి పాయసం నివేదిన చేయాలి.