Begin typing your search above and press return to search.

వంశీతో ఆ ఇద్దరి వార్.....గన్నవరం గరం గరం.

By:  Tupaki Desk   |   9 Aug 2022 5:30 PM GMT
వంశీతో ఆ ఇద్దరి వార్.....గన్నవరం గరం గరం.
X
గన్నవరం అసెంబ్లీ సీటు కాదు కానీ వైసీపీకి ఎక్కడ లేని తలనొప్పులూ వస్తున్నాయి. ఏంచక్కా ఉన్న పార్టీలో వారికే టికెట్ ఇచ్చేస్తే పోయేదానికి బయట నుంచి అందునా టీడీపీలో ఉండి వైసీపీని ఓడించి గెలిచి వచ్చిన వల్లభనేని వంశీకి వైసీపీలో పెద్ద పీట వేశారు జగన్. దాంతో పాటు ఆయనకే ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ అని కూడా మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పటికే ప్రకటించారు. తమ మిత్రుడైన వంశీకి వ్యతిరేకంగా ఎవరూ మీడియాకు ఎక్కవద్దు. అలా కనుక చేస్తే పార్టీపరంగా కఠిన చర్యలు ఉంటాయని గట్టిగానే హెచ్చరించారు. అయితే షరా మామూలే అన్నట్లుగా గన్నవరంలోని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు దుట్టా రామచంద్రరావు ఇద్దరూ కలసి మీడియాకు మళ్ళీ ఎక్కారు.

గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఇసుక దందా చేస్తున్నారని వారు నేరుగా ఆరోపించారు. వంశీ ఎక్కడికక్కడ కమిషన్లు నొక్కేస్తున్నారు అని కూడా వారు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వంశీ కూడా మీడియా ముందుకు రాక తప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే వంశీకి టికెట్ ఇస్తున్నామని ఎవరు చెప్పినా అది తప్పేనని తమలో ఎవరో ఒకరికి చివరికి టికెట్ ఖాయమని దుట్టా, యార్లగడ్డ నమ్మకంగా ఉన్నారుట.

ఈలోగా వంశీకి సొంత పార్టీలోనే పెట్టాల్సినంతగా పొగ పెట్టేస్తే ఆయన వైసీపీని తానుగా వీడిపోతారని ఎత్తులు వేస్తున్నారుట. అయితే వంశీ కూడా ఈ విషయంలో మధన పడుతున్నారట. తాను అనవసరంగా టీడీపీని వీడి వచ్చాను అని ఆయన భావిస్తున్నారుట. కానీ ఏమి లాభం. ఆయన వైసీపీలోకి దూకేసి టీడీపీని దాని అధినాయకుడిని నానా మాటలు అన్నారు.

అక్కడ ఇపుడు ఏ మాత్రం చోటు లేదు, ఇక్కడేమో పొగ పెట్టేస్తున్నారు. దాంతో వంశీకి తన రాజకీయం ఏమీ పాలుపోకుండా ఉందిట. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ తాజాగా వంశీని పిలిపించుకుని మాట్లాడారుట. ఈ సందర్భంగా వంశీ తన గోడు అంతా అధినేత వద్ద వెళ్లబోసుకున్నారుట. తనకు గన్నవరంలో ఎదురులేదని, అక్కడ టీడీపీతో కూడా ఎలాంటి సమస్య లేదని, కానీ సొంత పార్టీలో ఈ ఇద్దరు నేతల నుంచి మాత్రం తలనొప్పులు తప్పడంలేదని జగన్ కి ఫిర్యాదు చేశారుట.

మరి జగన్ మాత్రం ఏమి చేయగలరు. వారు ముందు నుంచి ఉన్న వారు. రెండు సార్లు టికెట్ పొందిన వారు. పార్టీకి సేవ చేసిన వారు. వారికి నచ్చచెప్పి వంశీకి టికెట్ ఇవ్వాలనుకుంటే కుదిరే వ్యవహారం కాదని తేలిపోయింది. వారిని బయటకు పంపించే కఠిన చర్యలకు జగన్ దిగితే అది మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని గెంటేస్తున్నారు అన్న వ్యతిరేక సంకేతం మొత్తానికి పంపించినట్లు అవుతుందని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

దాంతో ఏమీ చేయలేని పరిస్థితిలో హై కమాండ్ ఉంది. మరో వైపు దుట్టా, కానీ యార్లగడ్డ కానీ తన వంతు ప్రయత్నాలు బయట పార్టీలతో చేసుకునే ఇలా వంశీని బదనాం చేస్తున్నరు అని అంటున్నారు. దీంతో గన్నవరంలో గెలుపు కోసం అత్యాశ పడిన వైసీపీకి ఇటు వంశీ కానీ అటు యార్లగడ్డ, దుట్టా కానీ మిగిలుతారా అన్న డౌట్లు అయితే ఉన్నాయట. చూడాలి మరి ఏం జరుగుతుందో.