Begin typing your search above and press return to search.

దువ్వాడ వర్సస్ అయ్యన్న: ఇద్దరూ ఇద్దరే.. అస్సలు తగ్గెదెలే!

By:  Tupaki Desk   |   23 Jan 2022 4:46 AM GMT
దువ్వాడ వర్సస్ అయ్యన్న: ఇద్దరూ ఇద్దరే.. అస్సలు తగ్గెదెలే!
X
ఏపీలో రాజకీయం అంతకంతకూ దిగజారి పోతోంది. ఎవరికి వారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. మర్యాద అన్నది లేకుండా .. ప్రత్యర్థిపై విరుచుకుపడటమే ప్రధాన లక్ష్యంగా మారుతోంది. నువ్వు రెండు అంటే నేను ఆరు అంటా అన్నట్లుగా తయారైంది. ఇదే తీరులో రాజకీయం కొనసాగితే.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారటం ఖాయం. గతంలో మరణించిన వారి గురించి అగౌరవంగా మాట్లాడటం చాలా పెద్ద తప్పుగా భావించేవారు. ఇప్పుడు దాన్ని గాలికి వదిలేశారు.

రాజకీయం ఎంతైనా ఉండనివ్వండి. దాన్ని నేతల కుటుంబసభ్యుల వద్దకు తీసుకొచ్చేవారు కాదు. మహిళల జోలికి అస్సలు వెళ్లేవారు కాదు. కానీ.. ఆ గీతను దాటేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏపీలో రాజకీయాన్ని చూస్తే.. ఇదేం తీరు? వీరేం మనుషులు అన్నట్లుగా తయారైంది. రాష్ట్రం.. రాష్ట్ర ప్రజల కంటే కూడా రాజకీయ పార్టీల మైలేజీ మాత్రమే ప్రధానాంశంగా.. చౌకబారు వ్యాఖ్యలకు పెద్ద పీట వేయటం.. నిందాపూర్వక వ్యాఖ్యల స్థాయి దాటేసి.. వ్యక్తిగత దూషణలకు దిగజారటమే కాదు.. వినలేని పరిస్థితులకు తీసుకొస్తోంది. ఇదంతా చూస్తే.. ఇదేం పోయే కాలమన్న భావన కలుగక మానదు.

తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. విపక్షానికి చెందిన సీనియర్ నేత ఒకరి మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడటమే కాదు.. మర్యాదల్ని పూర్తిగా వదిలేసి ఎంత మాట పడితే అంత మాట అనేందుకు బరి తెగిస్తున్నారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన అయ్యన్నపాత్రుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంలో.. సీఎం సతీమణిని తమ రాజకీయ వ్యాఖ్యల్లోకి తీసుకొచ్చేశారు.

‘అమ్మా.. భారతమ్మ.. ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీచూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ.. మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాద్ లో కాని.. విశాఖపట్నంలో గాని ఆసుపత్రిలో చూపంచండమ్మా’ అంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు దారుణంగా రియాక్టు అయ్యారు. అయ్యన్నపాత్రుడు ఇంతలా మాట్లాడటానికి కారణం.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఎయిర్ పోర్టు కట్టాలంటూ తీసుకున్న నిర్ణయమే.

ముఖ్యమంత్రి మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని.. తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వనాశనం చేస్తున్నారన్నారు. ‘రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏమయ్యాయి? పోలవరం.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. ట్రైబల్ వర్సిటీ వంటి వాటి నిర్మాణాలను గాలికి వదిలేసి.. జిల్లాకో ఎయిర్ పోర్టు కడతావా? ఉద్యోగులకు.. పెన్షన్ దారులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని జగన్.. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తూ.. జిల్లాకో ఎయిర్ పోర్టు కడతామని చెప్పటానికి సిగ్గులేదా?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు ఓ నపంశకుడని.. సీఎం జగన్ ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తే.. నాలుక కోస్తామన్నారు. నపంశుకుడైన అయ్యన్నను ఆయన భార్య ఎలా భరిస్తోందని?ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను గద్దె దింపిన తర్వాత సభలో చంద్రబాబు వెకిలి చేష్టలు మరిచిపోయారా? అంటూ మండిపడ్డారు. మొత్తంగా నువ్వు ఒకటంటే.. నేను పద్నాలుగు అంటానన్న తీరుకు ఏ మాత్రం తీసిపోకుండా మాట్లాడుతున్న వైనం షాకింగ్ గా మారింది. ఇదే రీతిలో సాగితే.. ఈ మాటల తూటాలు చివరకు ఎంతలా దిగజారిపోతాయో అన్నది అర్థం కాని పరిస్థితికి వెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.