Begin typing your search above and press return to search.

వైరస్ సంక్షోభం నుంచి గట్టెక్కేదెలా.. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి మాటేంటి..

By:  Tupaki Desk   |   25 Sept 2020 6:00 AM IST
వైరస్ సంక్షోభం నుంచి గట్టెక్కేదెలా.. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి మాటేంటి..
X
కరోనా రాకతో దేశంలో అన్ని రంగాలు కుప్ప కూలిపోయాయి. అంతకుముందే మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధి రేటు పూర్తిగా పడిపోయింది. నిరుద్యోగిత బాగా పెరిగింది. ఎన్నో కంపెనీలు, సంస్థలు దివాళా తీశాయి. బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోయాయి. ఆంక్షల సడలింపులతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నగరాల్లో ఉపాధి అవకాశాలు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. గ్రామాల్లో మాత్రం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఉపాధి హామీ పథకం చాలా మంది కూలీలను ఆదుకుంటుండగా..సరైన సమయానికి వర్షాలు కురవడంతో సాగు పనులు జోరందుకున్నాయి.

వ్యవసాయ కూలీలకు కూడా గిరాకీ పెరగడం తో వారు కాస్తో కూస్తో డబ్బు ముఖం చూస్తున్నారు. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'కరోనా ఆర్థిక సంక్షోభానికి ముందు భారత వృద్ధి రేటు 5 నుంచి 6 వరకు ఉంది. దశాబ్ద కాలంలో అత్యల్ప వృద్ధి రేటు ఇదే. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా రాకతో దేశం మరింత సంక్షోభం లో కూరుకు పోయింది.

సరైన ఆర్థిక విధానాలు పాటిస్తే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మూడు నుంచి ఐదేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. కరోనా కంటే దేశంలో ముందుగా నమోదైన వృద్ధి రేటు 4.1శాతం. జనాలు ఉపాధి కోల్పోకుండా చూడటం, వృద్ధిరేటు తిరిగి పొందడం దేశం ముందున్న సవాళ్లు.ఉపాధి హామీ పథకం గ్రామీణులకు ఎంతో చేయూతగా నిలుస్తోంది. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పటికిప్పుడు బయటపడ్డా దేశం కోలుకోవడానికి కనీసం ఏడాది పట్టొచ్చు. కరోనాతో ఒక్క ఆర్థిక త్రైమాసికంలోనే వృద్ధి రేటు 23.9 శాతం కుంచించుకుపోయింది. ఈ ఏడాది రెండంకెల రుణాత్మక వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇటీవల వ్యవసాయంలో తీసుకు వచ్చిన సంస్కరణలు, నగదు బదిలీ అమలు చేయడం కారణంగా జనాల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను కొంచెం దారిలోకి తేవొచ్చు. ప్రజల చేతుల్లోకి డబ్బు చేరితే వినియోగం పెరుగుతుంది. ప్రభుత్వం రుణాలు తీసుకోవడం తగ్గించు కోవాలి. ఇప్పుడున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు కనీసం పది లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. అందుగ్గాను తయారీ రంగాన్ని ప్రోత్సహించి పెట్టుబడులు పెంచాలి. ఉద్యోగాలను కల్పించే సంస్థలను గుర్తించి ఆర్థికంగా ప్రోత్సహం అందించాలి. ఉపాధి హామీ పథకంలో కూలీల, సంఖ్య పనులు పెంచాలి.బ్యాంకులకు పెట్టుబడులు అందించాలి' అని దువ్వూరి సుబ్బారావు సూచించారు.