Begin typing your search above and press return to search.

శైల‌జ క‌న్నీళ్ల‌కు జ‌వాబు చెబుతావా బాబు

By:  Tupaki Desk   |   8 Dec 2017 4:54 AM GMT
శైల‌జ క‌న్నీళ్ల‌కు జ‌వాబు చెబుతావా బాబు
X
ఎవ‌రీ శైల‌జ‌. ఎప్పుడూ విన్న‌ట్లే లేదే! అవును.. ఇప్ప‌టివ‌ర‌కూ శైల‌జ మీడియాకు తెలీదు కోట్లాది మంది సామాన్యుల్లోనూ సామాన్య‌మైన వ్య‌క్తి. స‌గ‌టు జీవుల్లో చూస్తే.. ఆమెకు ఎలాంటి గుర్తింపు లేదు. కాకుంటే.. పిల్ల‌ల్ని పెద్ద‌వాళ్ల‌ను చేయాల‌ని.. వారికి చ‌క్క‌టి చ‌దువు సంధ్య‌లు నేర్పించాల‌ని.. కుటుంబానికి ఆద‌ర‌వుగా మారాల‌న్న త‌ప‌న ఉంది. త‌న వంతు తాను క‌ష్టం చేసినా ఫ‌లితం ద‌క్క‌ని నిరుపేద‌ల్లో ఆమె ఒక‌రు.

అలాంటి ఆమె ఇప్పుడు వార్త ఎందుకైంది? ఆమె గురించి చ‌ద‌వాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న ప్ర‌శ్న‌లు అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆమె క‌న్నీళ్లు ఇప్పుడు కొత్త ప్ర‌శ్న‌లు సంధించ‌ట‌మే కాదు.. ఏదో చేసేశానంటూ గొప్ప‌లు చెప్పే ఏపీ ముఖ్య‌మంత్రి గొంతుకు అడ్డుప‌డేలా శైల‌జ క‌న్నీళ్లు మార‌నున్నాయి. శైల‌జ ఒక్క‌తే కావొచ్చు. కానీ.. ఆమె స‌మ‌స్య కొన్ని వేల మంది గొంతుక‌. ఇంత‌క ఆమె స‌మ‌స్య‌లేంటి? దానికి.. చంద్ర‌బాబు స‌ర్కారుకు లింకేమిట‌న్న విష‌యంలోకి వెళితే..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. తాను అధికారంలోకి వ‌చ్చినంత‌నే డ్వాక్రా అక్క‌చెల్లెళ్ల రుణాల్ని పూర్తిగా తీర్చేస్తానంటూ భారీ హామీనే ఇచ్చేశారు. బాబు చెప్పే మాట‌ల్ని.. ఇచ్చిన‌ హామీల్ని న‌మ్మిన కోట్లాది మందిలో ఆమె ఒక‌రు. బాబు ప‌వ‌ర్ లోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతోంది. డ్వాక్రా గ్రూపులో ఆమెకున్న అప్పులో పైసా కూడా ర‌ద్దు కాలేదు. అంతేనా.. బ్యాంకు అప్పు కింద పుస్తెల తాడు జ‌మైంది. అయినోళ్ల ద‌గ్గ‌ర త‌లెత్తుకోలేక‌.. మెడ‌లో పుస్తెల తాడు లేకుండా పోవ‌టంపై ఆమె బావుర‌మంది.

ఇదొక్క శైల‌జ స‌మ‌స్య కాదు. ఆమె లాంటి ఎంద‌రో ఆడ‌బిడ్డ‌ల‌ది. ఇంత‌కీ.. శైల‌జ వేద‌న బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చిందంటే.. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని తెలుసుకోవ‌టానికి న‌డిచి వెళుతున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో యువ‌నేతను వ‌చ్చి క‌లిసింది శైల‌జ‌. జ‌గ‌న్‌ కు హార‌తి ఇస్తూ.. క‌ళ్ల‌ల్లో నీళ్లు సుడ‌లు తిరుగుతుండ‌గా.. ఇక వ‌ద్ద‌న్న‌.. రాక్ష‌స పాల‌న వ‌ద్దు. రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ రావాల‌న్నా.. ఈ రాక్ష‌స పాల‌న ఒక వ‌ద్ద‌న్నా.. బ్యాంకు అప్పు కింద పుస్తెల తాడు కూడా జ‌మైందంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలోని క‌ల్లుల‌మ‌డి కి కాస్త దూరంలో చోటు చేసుకున్న ఈ వైనం అక్క‌డి వారిని క‌దిలించింది. ఇదిలా ఉంటే.. గురువారం ఉద‌యానికి జ‌గ‌న్ పాద‌యాత్ర 400 కిలోమీట‌ర్ల మార్క్ దాటింది. 29 రోజుల పాద‌యాత్ర‌లో ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మందిని క‌లుస్తున్న జ‌గ‌న్‌.. ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని.. స‌గ‌టుజీవుల ఈతి బాధ‌ల్ని ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటున్నారు. జ‌గ‌న్‌ కు త‌మ వేద‌న‌ల్ని చెప్పుకునేందుకు సామాన్యులు బారులు తీరుతున్నారు.