Begin typing your search above and press return to search.

ఎంసెట్ స్కాం..లీక్‌ లో నారాయ‌ణ‌ - శ్రీ‌చైత‌న్య డీన్‌

By:  Tupaki Desk   |   5 July 2018 5:02 PM GMT
ఎంసెట్ స్కాం..లీక్‌ లో నారాయ‌ణ‌ - శ్రీ‌చైత‌న్య డీన్‌
X
సంచ‌ల‌నం సృష్టించిన ఎంసెట్ పేప‌ర్ లీకేజీలో అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కార్పొరేట్ కాలేజీలైన నారాయణ - శ్రీచైతన్య భాగ‌స్వామ్యం ఉంద‌ని తేలింది. శ్రీచైతన్య కళాశాల డీన్‌ వాసుబాబును ఈరోజు హైదరాబాద్‌ లో పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో క‌ల‌క‌లం రేగుతోంది. వాసుబాబు శ్రీచైతన్య కళాశాల డీన్‌ గా పనిచేస్తున్నాడు. నారాయణ - శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజెంట్ క‌మ్మ వెంక‌ట శివ‌నారాయ‌ణ‌ని కూడా అరెస్ట్ చేశారు. నిందితులు మొత్తం ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేశారని పోలీసులు తెలిపారు.

వాసుబాబుతోపాటు నారాయణ - శ్రీచైతన్య కళాశాలకు ఏజెంట్‌ కమ్మ వెంకటశివనారాయణని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్‌ లీకేజీ కేసు ప్రధాన నిందితుడితో వాసుబాబు - శివనారాయణ నిరంతరం టచ్‌ లో ఉన్నారని సీఐడీ అధికారులు తేల్చారు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిని 2016లో వాసుబాబు కలిశారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఒక్కో విద్యార్థి నుంచి వాసుబాబు రూ.35 లక్షలు వసూలు చేసి ప్రశ్నపత్రాలు అందజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాల్ లిస్ట్ ఆధారంగా నిందితులను సీఐడీ అధికారులు గుర్తించారు. ఆరుగురు విద్యార్థులకు వాసు బాబు ముందస్తుగా పేపర్లు అందించినట్లు తేలింది. ఈ ఆరుగురిలో ముగ్గురికి టాప్ ర్యాంకులు కైవసం అవ‌డం గ‌మ‌నార్హం. ప్రధాన నిందితులు ధనుంజయ ఠాకూర్ - సందీప్ కుమార్ లతో శ్రీచైతన్య నారాయణ కాలేజ్ సిబ్బందికి సంబంధాలు ఉన్నాయ‌ని తేలింది. భువనేశ్వర్ కేంద్రంగా జరిగిన పేపర్ లీకేజీలో వాసుబాబు కీలకపాత్ర పోషించారు. ఆరుగురు విద్యార్థులతో భువనేశ్వర్‌ లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశార‌ని పోలీసులు వివ‌రించారు.. ఒక్కొక్క విద్యార్థి నుంచి 36 లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.