Begin typing your search above and press return to search.

వందేళ్ల వరకూ భూమి అంతమైపోదు

By:  Tupaki Desk   |   11 Oct 2015 3:55 AM GMT
వందేళ్ల వరకూ భూమి అంతమైపోదు
X
యుగాంతం అంటూ టీవీ ఛానళ్లు ఊదరగొట్టేసినా.. కొత్త సినిమాలు తయారైనా జనం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. కనీసం మరో వందేళ్ల వరకు భూమికి వాటిల్లగల ప్రమాదం గురించి దిగుల్లేదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ మేరకు ధ్రువీకరించేస్తోంది. వారు చెప్పే ప్రకారం మనం నివసిస్తున్న ప్రపంచం పెను ప్రమాదానికి గురి కాకుండా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చట. భూగ్రహాన్ని ఒక ప్రమాదకరమైన గ్రహశకలం ఢీకొట్టి ప్రళయాన్ని సృష్టించనుందన్న వార్తలకు, పుకార్లకు నాసా పుల్‌స్టాప్ పెట్టేసింది. ఇలా ప్రకటించడం ద్వారా భూమి అంతరించిపోనుందన్న భయాలు పెట్టుకోవద్దని హామీ ఇచ్చింది.

గంటకు 40 వేల కిలోమీటర్ల పెనువేగంతో సంచరిస్తున్న అస్టరాయిడ్ 86666 పేరు గల గ్రహశకలం కోటీ 50 లక్షల మైళ్ల దూరం నుంచి భూగ్రహాన్ని శనివారం దాటిపోవడంతో భూమికి ముప్పు తప్పిందని నాసా ప్రకటించింది. ఈ గ్రహశకలం 2.5 కిలోమీటర్ల కఠిన శిల. దీని ఉనికిని 16 ఏళ్లకు క్రితం అంటే 2000 సంవత్సరంలో ఆరిజోనా యూనివర్శిటీలోని కాటలీనా స్కై సర్వే వారు మొదటిసారిగా గుర్తించారు. కాని దీని ఉనికిని కనుగొన్న 15 ఏళ్ల తర్వాత ఇది భూమికి సమీపంగా ఎప్పుడు వస్తుందన్న సమాచారాన్ని ప్రపంచానికి చెప్పకుండా నాసా కుట్ర చేసిందన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడంతో నష్టనివారణకు నాసా నడుం కట్టింది.

భూమి ఆస్టరాయిడ్ 86666 గ్రహశకలం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో పరస్పరం సమీపించనున్నాయని గత ఆగస్టులోనే నాసా ప్రకటించింది. ఈ వారం వచ్చే వారం ఇవిరెండు వాటి అత్యంత సమీప బిందువుకు చేరుకుంటాయని పేర్కొంది. ఆ తర్వాత నవంబర్ మధ్య నుంచి అవి పరస్పరం దూరంగా జరిగిపోతాయని నాసా అధికారులు ప్రకటించారు. ఈ మొత్తం పరిణామాన్ని తాము గతంలోనే సూచించామని, భూమికి ఇప్పుడు ఆ గ్రహశకలం వల్ల ప్రమాదం ఏదీ లేదని వారు స్పష్టం చేశారు.

నాసా స్పష్టీకరణ ప్రకారం సమీప భవిష్యత్తులో భూమికి గ్రహశకలాల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం లేదు. వచ్చే వందేళ్లపాటు భూమిని సమీపించే గ్రహశకలాల సంఖ్య 0.01 శాతమేనని, ఇవి భూమిపై ప్రభావం చూపే అవకాశం చాలా చాలా తక్కువని నాసా తెలిపింది. అంటే మానవులే కాదు మన భూమి కూడా వందేళ్లపాటు గుండెల మీద చేయి వేసుకుని నిశ్చింతగా గడిపేయపచ్చన్నమాట.