Begin typing your search above and press return to search.

భూకంప జోన్‌ లో బెజ‌వాడ‌..అమ‌రావ‌తికి ఎఫెక్ట్ ఎంత‌..?

By:  Tupaki Desk   |   15 Oct 2019 8:27 AM GMT
భూకంప జోన్‌ లో బెజ‌వాడ‌..అమ‌రావ‌తికి ఎఫెక్ట్ ఎంత‌..?
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ఏ ముహూర్తంలో మొద‌లు పెట్టారో కానీ - దానికి ఎదుర‌వుతున్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక స‌మ‌స్య ఈ ప్రాంతాన్ని ప‌ట్టి పీడిస్తోంది. గ‌త సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా దీనిని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దేశంలోని అనేక న‌దుల నుంచి నీటిని - మ‌ట్టిని సేక‌రించి ఇక్క‌డ కుమ్మ‌రించారు. ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాప‌న చేశారు. ఇక‌, శంకుస్థాప‌న అయితే - జ‌రిగింది కానీ.. నిర్మాణాలు స‌హా ఏవీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు దూకుడుగా ముందుకు సాగింది లేదు.

ఇంత‌లోనే ప్ర‌భుత్వం మారిపోవ‌డంతో మ‌రింత‌గా ఈ ప్రాజెక్టు చిక్కుల్లో ప‌డిపోయింది. రాజ‌ధానిని ప్ర‌పంచ ప‌టంలో నిలబెట్టాల‌నే త‌ప‌న గ‌త సీఎం చంద్ర‌బాబులోను - ఇప్పుడున్న సీఎం జ‌గ‌న్‌ లోనూ ఉంద‌నడంలో సందేహం లేదు. అయితే, ఈ విష‌యంలో అనుస‌రిస్తున్న విధానాల్లోనే కొద్దిపాటి వ్య‌త్యాసాలు ఉన్నాయి. స‌రే ఏదేమైనా రాష్ట్రానికి రాజ‌ధాని అవ‌స‌రం. అయితే, ఇప్పుడు అమ‌రావ‌తి నిర్మాణాలు వివిధ కార‌ణాల‌తో నిలిచిపోయాయి. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పేరుతో రాష్ట్ర‌ వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో అభివృద్ధి జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆశిస్తోంది.

అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి భూముల విష‌యంలో అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ కూడా చేయిస్తోంది. దీనికితోడు ఇవ్వ‌నా వ‌ద్దా.. అంటూ కేంద్రం ఇస్తున్న అమ‌రావ‌తి నిధులు కూడా పులుసులో క‌లిసి పోతున్నాయి. దీంతో దీంతో అమ‌రావ‌తి నిర్మాణం మూడు అడుగులు ముందుకు - ఏడు అడుగులు వెన‌క్కి చందంగా మారిపోయింది. ఇక‌, ఇప్పుడు మ‌రో స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. దేశంలోని 50 కీల‌క ప్రాంతాలు భూకంపాల జోన్‌ లో ఉన్నాయ‌ని ఐఐటీ హైద‌రాబాద్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన అధ్య‌య‌నం లో తేలింది. ఐఐటీ హైద‌రాబాద్‌ - నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్‌ - కేంద్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా ఈ అధ్య‌య‌నం చేశాయి.

ఈ అధ్య‌య‌నంలో వ‌చ్చే వంద సంవ‌త్స‌రాల్లో.. విజ‌య‌వాడ - ఢిల్లీ - పుణే - చెన్నై - ముంబై స‌హా ప‌లు కీల‌క న‌గ‌రాల‌కు భూకంప ముప్పు పొంచి ఉంద‌ని తేలింది. ఇప్పుడు ఈ విష‌యం దేశంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ప‌రిణామం అమ‌రావ‌తిపై ఎఫెక్ట్ చూపుతుందా? అనేది చ‌ర్చ సారాంశం. ఇప్పుడు ఇచ్చిన నివేదిక ను బ‌ట్టి చూస్తూ.. ప్ర‌మాదం ఏమైనా ఉంటే.. అది విజ‌య‌వాడ‌కే ప‌రిమితం. అంతే త‌ప్ప‌.. విజ‌య‌వాడ నుంచి దాదాపు 50 కిలో మీట‌ర్ల దూరంలో గుంటూరు జిల్లాలో ఉన్న అమ‌రావ‌తిపై ఎఫెక్ట్ ఉంటుంద‌ని ఎవ‌రైనా చెబితే.. దానిని న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

గ‌తంలో అమ‌రాతిపై శివ‌రామ‌కృష్ణ‌న్ ఇచ్చిన నివేదిక‌లో కూడా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతంగా మాత్ర‌మే అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల‌ను పేర్కొన్నారు. త‌ప్ప‌ - భూకంపాల జోన్‌ లో గుంటూరు ఉండే అవ‌కాశం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గుంటూరు ప్రాంతం అంతా కూడా.. గ‌ట్టి నేల‌. అంటే.. భూపొరలు ఎక్కువ మందంతో ఉండ‌డంతోపాటు.. వివిధ ఖ‌జ‌నాల‌తో కూడి ఉంటాయి. ముఖ్యంగా లేట‌రైట్ నేల‌లు అధికంగా ఉన్నాయి. రాజ‌ధానికి నాలుగు నుంచి ఐదు కిలో మీట‌ర్ల దూరంలోనే గ‌ట్టి నేల‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి. అలాంటి ప్రాంతంలో భూకంపాల‌కు అవ‌కాశం ఉండ‌ద‌నే విష‌యం తెలిసిందే. సో.. ఎలా చూసినా.. విజ‌య‌వాడ‌కు భూకంపాలు పొంచి ఉన్నాయ‌నే విష‌యం వాస్త‌వ‌మే అయినా.. దీనిని అడ్డుపెట్టుకుని అమ‌రావ‌తి ఆగిపోతుంద‌నే ప్ర‌చారం మాత్రం ప‌స‌లేనిదే!!