Begin typing your search above and press return to search.

వామ్మో భూకంపం: వ‌ణికిన ఉత్త‌రాది

By:  Tupaki Desk   |   26 Oct 2015 9:47 AM GMT
వామ్మో భూకంపం: వ‌ణికిన ఉత్త‌రాది
X
అక్క‌డెక్క‌డో హిందూకుష్ ప‌ర్వ‌త సానువుల్లో భూమి అట్ట‌డుగు లోతుల్లో భూ ప‌ల‌కాల మ‌ధ్య నెల‌కొన్న రాపిడి.. దేశ దేశాల్ని వ‌ణికించింది. ఆఫ్ఘ‌న్ కేంద్రంగా రిక్ట‌ర్ స్కేల్ పై 7.5 తీవ్ర‌త‌తో న‌మోదైన భూకంపం ధాటికి ఉత్త‌రాది చిగురుటాకులా వ‌ణికింది. జ‌మ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ భూప్ర‌కంపన‌లు చోటు చేసుకున్నాయి.

ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణంలో ఒక్క‌సారిగా భూమి స్వ‌ల్పంగా వ‌ణికే స‌రికి ప్ర‌జ‌లు వ‌ణికిపోయారు. బెదిరిపోయారు. ఢిల్లీలోని మండిహౌస్ ద‌గ్గ‌ర మెట్రో రైల్లో ప్ర‌శాంతంగా ఉన్న వారిలో ఈ ప్ర‌కంప‌న‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిపడేలా చేయ‌ట‌మేకాదు.. మెట్రో రైలును విడిచి.. స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

ఇలాంటి దృశ్యం ఒక్క మండీహౌస్ రైల్వేస్టేష‌న్ లో మాత్ర‌మే కాదు.. ఢిల్లీలోని అన్నీ ప్రాంతాల్లో ఇదే ప‌రిస్థితి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. హ‌ర్యానా.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పంజాబ్‌..జైపూర్‌.. భోపాల్ స‌హా చాలా ప్రాంతాల్లో భూకంపం ధాటికి ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోయారు. ఇళ్ల‌ల్లో నుంచి ఆఫీసుల్లో నుంచి ప‌రుగులు తీశారు. మిగిలిన చోట్ల‌తో పోలిస్తే.. జ‌మ్మూకశ్మీర్‌ లో తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. భూకంపం ధాటికి ఆ రాష్ట్రంలో స‌మాచార వ్య‌వ‌స్థ స్తంభించిన ప‌రిస్థితి. భార‌త్ తో పాటు.. అప్ఘ‌నిస్తాన్‌..పాక్ ల‌లోనూ భూకంప ప్ర‌భావం ప‌డింది.

ఢిల్లీతో పాటు.. ఐటీ కేంద్ర‌మైన గుర్గావ్ లోనూ ప‌రిస్థితి ఇంతే. ఆఫీసుల్లో ప‌ని చేసుకుంటున్న వారు కాస్తా.. భూకంప తీవ్ర‌త‌తో భ‌వ‌నాల్లోక‌ద‌లిక రావ‌టంతో ఒక్క‌సారి ఉలిక్కిప‌డ్డారు. భ‌యంలో కేక‌లు వేస్తూ బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.