Begin typing your search above and press return to search.

అర్థరాత్రి దాటాక తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..ఎక్కడెక్కడంటే?

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:27 AM GMT
అర్థరాత్రి దాటాక తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..ఎక్కడెక్కడంటే?
X
వీకెండ్ వేళ కాస్త ఆలస్యంగా పడుకోవటం అలవాటు. నగరాలు.. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి కాస్త తక్కువే. కాకుంటే టీవీల పుణ్యమా అని పదకొండు వరకూ మేలుకోవటం ఇవాల్టి రోజున సాధారణమైంది. టీవీలో కార్యక్రమాలు చూస్తూ ఉండిపోవటం ఒక అలవాటుగా మారింది. ఇలా..కాస్త ఆలస్యంగా పడుకున్న చాలా మందికి నిద్ర పట్టి.. అప్పుడే డీప్ స్లీప్ లోకి వెళుతున్న వేళ.. ఉలిక్కిపడి లేవటమే కాదు.. భయాందోళనలతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన వైనం తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. దాదాపు ఎనిమిది సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా చెబుతున్నారు. ఏపీలోని కృష్ణా - గుంటూరు జిల్లాల్లో.. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం.. నల్గొండ జిల్లాల్లో భూమి కంపించటంతో చాలామంది ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా నిద్ర లేకుండా రోడ్ల మీద గడిపారు. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 4.7 ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా భూమి కంపించిన ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ అలాంటి అనుభవం లేకపోవటంతో.. భయాందోళనలకు గురయ్యారు ప్రజలు. అయితే.. భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పినా.. తెలీని గుబులు అక్కడి వారిని వెంటాడుతోంది. ఇదిలా ఉంటే.. శనివారం చోటు చేసుకున్న భూకంపం కారణంగా టర్కీలో ఇరవై మంది వరకూ మరణించగా.. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ భూకంప తీవ్రత వల్లే తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు జిల్లాల్లో భూమి కంపించి ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఏమైనా.. భూకంపం గురించి వినటమే కానీ.. చూడటం మాత్రం ఇదే తొలిసారి అని అక్కడి వారు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.