Begin typing your search above and press return to search.

సోనియమ్మ పుట్టిన దేశంలో భారీ భూకంపం

By:  Tupaki Desk   |   24 Aug 2016 6:30 AM GMT
సోనియమ్మ పుట్టిన దేశంలో భారీ భూకంపం
X
సోనియమ్మ పుట్టిన దేశంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇటలీలో జన్మించిన విషయం తెలిసిందే. ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న అనంతరం ఆమె ఇండియాకు రావటం తెలిసిందే. తాజాగా ఇటలీలో చోటు చేసుకున్న భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ మీద 6.2 తీవ్రత నమోదైంది. ఈ భూకంప ప్రభావం ఇటలీ రాజధాని రోమ్ ను కూడా తాకినట్లుగా చెబుతున్నారు. రోమ్ పట్టణంలో దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తాజా ప్రకృతి కన్నెర్రతో ఏడుగురు మరణించగా.. పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలాయి. స్థానిక మీడియా సంస్థల కథనాల ప్రకారం భూకంప మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. దీన్ని అధికారికంగా ఖరారు చేయలేదు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూకంప తీవ్రత ఎమాట్రిస్ పట్టణంలో భారీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ పట్టణంలో దాదాపు సగం నేలమట్టమైందన్న వార్తలు వస్తున్నాయి. పట్టణ నడిబొడ్డున భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవటంతో ఇటలీ ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది.

దాదాపు ఏడేళ్ల కింద (2009) అకీలా ప్రాంతంలో భూకంపం చోటు చేసుకోగా.. నాటి ప్రకృతి వైపరీత్యంలో 300 మంది మరణించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న భారీ భూకంపం ఇదేనని చెబుతున్నారు. రోమ్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లగా గుర్తించారు. తాజా భూకంపంలో ప్రాణ నష్టంతో పాటు.. భారీగా ఆస్తినష్టం చోటు చేసుకుందని చెబుతున్నారు. భూకంప ప్రభావం 10 కిలోమీటర్ల మేర ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.