Begin typing your search above and press return to search.

దద్దరిల్లుతున్న తూర్పు ఉక్రెయిన్

By:  Tupaki Desk   |   21 Feb 2022 5:30 AM GMT
దద్దరిల్లుతున్న తూర్పు ఉక్రెయిన్
X
తూర్పు ఉక్రెయిన్ బాంబులు, తుపాకుల గర్జనలతో దద్దరిల్లిపోతోంది. రష్యా మద్దతు గా ఉండే ఉక్రెయిన్ తిరుగుబాటు దళాలు ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యాయి. అందుకనే ఉక్రెయిన్ సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య పరిస్థితులు గడచిన 24 గంటల్లో తీవ్ర ఉద్రిక్తతంగా మారిపోయాయి.

తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులంతా బాంబుదాడులతో మేతెక్కిపోతోంది. పరస్పర దాడులతో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారనే విషయంలో క్లారిటీ లేదు.

జరుగుతున్న పరిణామాలతో యూరప్ దేశాలంతా ఉలిక్కిపడుతున్నాయి. ముందు తిరుగుబాటు దళాలను రంగంలోకి ఉసిగొల్పి తర్వాత హఠాత్తుగా సైన్యాన్ని దింపాలన్నది రష్యా ఉద్దేశ్యంగా యూరప్ దేశాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ కు మూడువైపులా దాదాపు 2 లక్షల సైన్యాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోహరించారు. సైన్యానికి మద్దతుగా మోర్టార్లు, క్షిపణి వ్యవస్ధతో పాటు యుద్ధ ట్యాంకులు, అత్యాధునిక ఆయుధాలను కూడా రష్యా మోహరించిన విషయంపై యూరప్ దేశాల్లో టెన్షన్ పెరిగిపోతున్నాయి.

అందుబాటులోని సమాచారం ప్రకారం తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఇరువైపులా అంటే ఉక్రెయిన్ సైన్యం-తిరుగుబాటు దళాల మధ్య సుమారు 2 వేల పేలుళ్లు జరిగాయి. తిరుగుబాటు దళాలు ఉపయోగిస్తున్న బాంబులు, ఆయుధాలన్నీ రష్యా సరఫరా చేస్తున్నవే అని ఉక్రెయిన్ సైన్యాధికారులు ఆరోపిస్తున్నారు. తమతో రష్యా పరోక్ష యుద్ధం చేస్తోందని హఠాత్తుగా తమపై నేరుగా విరుచుకుపడేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఏదేమైనా ఇప్పటికే రెండు సార్లు సరిహద్దులకొచ్చి మరీ సైన్యాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యవేక్షించారు. సైన్యాధికారులంతా సరిహద్దులోనే ఉండటంతో పుతిన్ ఇక్కడికే వచ్చి సమావేశాలు పెట్టుకున్నారు. అంటే యుద్ధం చేయటానికి పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాకపోతే అనేక కారణాలతో యూరోపు దేశాలు తెస్తున్న ఒత్తిడి కారణంగా యుద్ధం ఆలస్యమవుతున్నట్లు అర్ధమవుతోంది. అందుకనే తిరుగుబాటు దళాల ద్వారా రష్యా పరోక్ష యుద్ధాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో ఉక్రెయిన్, రష్యా సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లోని జనాలంతా నగరాలవైపు తరలిపోతున్నారు. రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్ళు, బస్సులను నడుపుతున్నాయి.