Begin typing your search above and press return to search.

4 నెలలు ఏడిపించి ఇప్పుడు నవ్విస్తున్న మోడీ

By:  Tupaki Desk   |   11 Nov 2017 5:30 PM GMT
4 నెలలు ఏడిపించి ఇప్పుడు నవ్విస్తున్న మోడీ
X
ఇటీవల కాలంలో జీఎస్టీపై జనంలో కలిగినంత ఆగ్రహం.. జీఎస్టీపై జనం నుంచి వచ్చినన్ని జోకులు ఇంకే విషయలోనూ కనిపించలేదేమో. ఒకే పన్ను విధానం అంటూ ప్రజలందరి జేబులకూ ఒకేసారి దెబ్బేసిన మోడీ ఇప్పుడు మాత్రం కొన్ని విషయాల్లో మంచి రిలీఫ్ కలిగించారు. ముఖ్యంగా పట్టణ - నగర ప్రాంతాల ప్రజలకు మోడీ భారీ మిగులు చూపించారు. 28 శాతం జీఎస్టీ పరిధి నుంచి కొన్ని వస్తుసేవలను తొలగించడంతో ఈ ప్రయోజనం దక్కుతోంది. దీంతో గత నాలుగు నెలలుగా జీఎస్టీతో తాత్కాలికంగా ఏడిపించినా ఇప్పుడు కొన్నిటిపై పన్నులు భారీగా పన్నులు తగ్గించి ఆ బాధను శాశ్వతంగా పోగొట్టారు. ముఖ్యంగా భోజనం కోసం రెస్టారెంట్లు - హోటళ్లకు వెళ్లే నగర - పట్టణ ప్రజలకు ఆయన భారీ ఊరట కలిగించారు.

నగరాలు - పట్టణాల్లో జీవితం బిజీబిజీ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీసే ఎక్కువ కావడంతో వారు పనుల్లో ఉంటే సాయం చేసి భోజనం అమర్చేవారూ ఎవరూ ఉండరు. సో... హోటళ్లు - రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు - లేదంటే వెళ్లి పార్సిళ్లు తెచ్చుకుంటారు. అలాగే వారాంతాల్లో కుటుంబంతో పాటు వెళ్తుంటారు. ఇలా కనీసం నెలకు రెండుమూడు సార్లు రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఇక పార్సిళ్లు తెచ్చుకునే కుటుంబాలూ ఎక్కువే.

జీఎస్టీ రాకముందు రెస్టారెంట్లలో 14.5 శాతం వ్యాట్ - 6 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండేది. అంటే 20.5 శాతం పన్ను. ఇది చాలదన్నట్లుగా కొందరు సర్వీస్ చార్జెస్ పేరుతో మరో 10 శాతం వరకు వసూలు చేసేవారు. అంటే... 20.5 నుంచి 30 శాతం వరకు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేదన్నమాట. ఆ లెక్కన భోజనం ఖరీదు రూ.1000 అయితే - దానికి అదనంగా 2205 నుంచి 300 వరకు పన్ను కలిపి బిల్లు పెరిగిపోయేది.

ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఇన్ని పన్నుల్లేవు. ఒకటే పన్ను. కానీ... అది భారీగా ఉంది. రెస్టారెంట్లు అత్యధిక పన్ను కేటగిరీలో ఉండడంతో 28 శాతం పడేది. అంటే 1000 రూపాయలకు 280 ట్యాక్సు పడేదన్నమాట. దీంతో చిన్నపాటి రెస్టారెంట్లలోనూ అంతకుముందు కంటే మరో 8 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. తరచూ వెళ్లేవారికి ఇది భారంగానే మారింది. ఈ పన్ను ప్రజలకు భారం కావడంతో రెస్టారెంట్ల వ్యాపారంపైనా ప్రభావం పడింది.

అయితే... తాజాగా జీఎస్టీ కౌన్సిల్ లో చర్చించాక కొన్నిటిపై ట్యాక్సులు తగ్గించారు. రెస్టారెంట్లు 5 శాతం పన్ను పరిధిలోకి చేర్చారు. అంటే ఒక్కసారిగా 23 శాతం పన్ను తగ్గుతోంది. ఈ నిర్ణయం నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తోంది. రెస్టారెంట్ల యజమానులు - ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కొత్త ట్యాక్సులో రూ.1000 బిల్లు చేస్తే రూ.50 మాత్రమే పన్ను పడుతుంది. గతంతో పోలిస్తే ఇది భారీ ఊరట. తరచూ రెస్టారెంట్లకు వెళ్లేవారికి నెలకు రూ.1000 నుంచి రూ.3 వేల వరకు ఆదా అవుతుంది. అందుకే వారంతా ఇప్పుడు ‘‘మోడీ నాలుగు నెలలు ఏడిపించినా ఇక నెలనెలా మాతో రెండుమూడు వేలు పొదుపు చేయిస్తున్నారు’’ అంటూ సంబరపడుతున్నారు.