Begin typing your search above and press return to search.

అవును.. వారు ఎబోలాను జ‌యించారు

By:  Tupaki Desk   |   26 Nov 2015 12:42 PM GMT
అవును.. వారు ఎబోలాను జ‌యించారు
X
సాంకేతికంగా ఎంత వృద్ధి చెందినా.. డిజిట‌ల్ యుగంలో ఉన్నామ‌ని చంక‌లు గుద్దుకున్నా.. స‌రిగ్గా ఒక కొత్త వైర‌స్ విరుచుకుప‌డితే ప్ర‌పంచ దేశాల‌న్నీ వ‌ణికిపోయే ప‌రిస్థితి. దాదాపు ఏడాదిన్న‌ర‌ కింద‌ట ఎబోలా పేరు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించింది. ఈ చిన్ని వైర‌స్ ఒక్క‌సారి మ‌నిషి శ‌రీరంలోకి ఎక్కితే చాలు.. ఇక అంతే సంగ‌తులన్న ప‌రిస్థితి. ఆఫ్రికాలో మొద‌లై ఎబోలా వైర‌స్ ఆరాచ‌కంతో అభివృద్ధి చెందిన దేశాల నుంచి వ‌ర్థ‌మాన దేశాల వ‌ర‌కూ బిక్క‌చ‌చ్చిపోయాయి. వైర‌స్ వ‌స్తుంద‌న్న భ‌య‌మే ఇంత‌లా ఉంటే.. ఇక‌.. ఎబోలా ధాటికి గురైన దేశం ప‌రిస్థితి మ‌రెంత దారుణంగా ఉంటుంది? అలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొన్న దేశం..సియోర్రా లియోన్‌.

ఎబోలా కార‌ణంగా ఈ దేశంలో 2014 మే నుంచి మొత్తంగా 8,704 కేసులు నమోదు కావ‌ట‌మే కాదు.. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 3,589 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ దేశంలోని ప‌రిస్థితి చూసి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం త‌ల పట్టుకునే ప‌రిస్థితి. మొత్తంగా ఈ వ్యాధి మీద ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌టంతోపాటు..అనేక నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌టంతో దీని ప్ర‌భావం నుంచి ఇప్పుడా దేశం బ‌య‌ట‌ప‌డింది.

గ‌డిచిన 42 రోజుల్లో ఒక్క ఎబోలా కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌టంతో ఆ దేశ స‌ర్కారుతో పాటు.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. అంతేకాదు.. ఎబోలా ర‌హిత దేశంగా పశ్చిమాఫ్రికాలోని సియోర్రాను ప్ర‌క‌టించ‌టంతో ఆ దేశ వాసుల ఆనందానికి హ‌ద్దుల్లేకుండా పోయింది. ఎబోలా ర‌హిత దేశంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌జ‌లు బై బై ఎబోలా అంటూ స‌ర‌దాగా చిందేసి.. దాన్ని వీడియోగా మ‌ల‌చి పోస్ట్ చేశారు. మృత్యుముఖం వ‌ర‌కు వెళ్లి బ‌య‌ట‌ప‌డ‌టం ఎవ‌రికి మాత్రం సంతోషంగా ఉండ‌దు..?