Begin typing your search above and press return to search.

రజత్ కుమార్ సారీ చెప్పారు.. ద్వివేది తప్పు ఒప్పుకున్నారు

By:  Tupaki Desk   |   12 April 2019 8:59 AM GMT
రజత్ కుమార్ సారీ చెప్పారు.. ద్వివేది తప్పు ఒప్పుకున్నారు
X
ఏపీ ఓటర్లకు కడుపు రగిలిపోతోంది. ఆ మాటకు వస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఓటర్ల పరిస్థితి ఇదే పరిస్థితి. మూడు నెలల క్రితం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న చేదు అనుభవాలకు తగ్గట్లే.. ఏపీలో తాజా ఉదంతాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయని చెప్పాలి. కాకుంటే.. ఈవీఎంల మొరాయింపు ఏపీలో మాదిరి భారీగా లేవని చెప్పాలి.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లక్షలాది ఓట్లు మిస్ కావటం.. పోలింగ్ నమోదు శాతాల్ని 28 గంటల తర్వాత వెల్లడించటం లాంటి తప్పులపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ సారీ చెప్పేసి.. లెక్క క్లోజ్ చేశారు. నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన ఏపీ ఎన్నికల పోరు నేపథ్యంలో.. ఈవీఎంల మొరాయింపు ఓటర్లకు చుక్కలు చూపించటమే కాదు.. వారి సహనానికి పరీక్ష పెట్టింది.

చాలామంది ఓటర్లు అదే పనిగా ఓట్లు వేయటానికి తిరగలేక.. ఊరుకుండిపోయిన పరిస్థితి. ఇక.. శాంతిభద్రతల సమస్య కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు కేంద్ర బలగాల్ని తక్కువగా పంపిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. ఎన్నికల వేళ సరైన భద్రత కల్పించకపోవటం వల్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న వైనాన్ని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు.

తగినంత బలగాలు కావాలని తాను.. కలెక్టర్లు.. ఎస్పీలు కోరినా ఎన్నికల సంఘం స్పందించని వైనాన్ని ఆయన ఒప్పుకున్నారు. ఈ కారణంతోనే హింసాత్మక ఘటనలు.. హత్యలు జరిగి పోలింగ్ ను ప్రభావితం చేశాయని ద్వివేదీ అంగీకరించటం చూస్తే.. తెలంగాణలో చోటు చేసుకున్న ఘటనలకు రజత్ కుమార్ సారీ చెప్పటం గుర్తుకు రాక మానదు. మొత్తంగా చూస్తే. చేసిన తప్పులకు సారీ.. విచారం వ్యక్తం చేయటం.. మేం సరిగా చేయలేకపోయామన్న ఒక్క మాటతో కోట్లాది మంది కష్టాన్ని తేల్చేయటం దేనికి నిదర్శనం?