Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగ సంఘాల ప్రకటన.. షో‘కాజ్’తో షాకిచ్చిన ఈసీ

By:  Tupaki Desk   |   17 March 2021 3:46 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగ సంఘాల ప్రకటన.. షో‘కాజ్’తో షాకిచ్చిన ఈసీ
X
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ తో భేటీ కావటం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు.. ఉపాధ్యాయుల అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానని సీఎం చెప్పినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఆంధ్రాలో ఇచ్చిన దాని కంటే ఎక్కువ శాతాన్ని తప్పకుండా ఇస్తానని ముఖ్యమంత్రి తమకు మాట ఇచ్చినట్లుగా పేర్కొన్న వైనంపై ఈసీ స్పందించింది.

ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పట్టభద్రులైన ప్రభుత్వ ఉద్యోగులను.. ఉపాధ్యాయులను ప్రభావితం చేసేందుకు.. ప్రలోభ పెట్టేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రింట్.. ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు ఇచ్చినట్లుగా కనిపిస్తోందని.. ఇది ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్దంగా పేర్కొంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో.. ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాలు ఉలిక్కిపడ్డాయి. ఎన్నికల సమయంలో సీఎంను తాము కలవటం.. అనంతరం29 శాతం ఫిట్ మెంట్.. రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు.. ప్రధానోపాధ్యాయులకు పదోన్నతలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపినట్లుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు టీవీ చానళ్లతో మాట్లాడిన వైనం తెలిసిందే.

దీనికి స్పందించిన ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసి.. 24 గంటల్లో జవాబులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో నోటీసులు అందుకున్న ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు జవాబులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఏమని సమాధానం ఇచ్చారన్నది మాత్రం బయటకు రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాడు తాము సీఎం కేసీఆర్ ను కలువలేదని చెప్పినట్లుగా తెలిసింది. అదే సమయంలో మరికొందరు మాత్రం తాము సీఎంను కలిశామని చెబుతున్నారు. మరి.. ఈసీకి ఉద్యోగ సంఘాల రిప్లై ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి ఈసీ ఏ రీతిలో స్పందిస్తుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు (బుధవారం) ఉదయం షురూ కానుంది.