Begin typing your search above and press return to search.

పవన్ కు షాక్.. గాజు గ్లాస్ చేజారింది.. 2025వరకు ఇంతేనా?

By:  Tupaki Desk   |   17 April 2021 3:46 AM GMT
పవన్ కు షాక్.. గాజు గ్లాస్ చేజారింది.. 2025వరకు ఇంతేనా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేసే వేళ.. పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ ఇకపై ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయించే అవకాశం లేదు. అవకాశాన్ని అనుసరించి.. కేటాయించొచ్చు.. లేకుంటే లేదు. కచ్ఛితంగా కేటాయించే అవకాశాన్ని ఆ పార్టీ కోల్పోయిన వైనాన్ని ఎన్నికల సంఘం తాజాగా పేర్కొంది. జనసేనతో పాటు.. ఎంసీపీఐ.. ఇండియన్ ప్రజా పార్టీ.. ప్రజాబంధు పార్టీ.. హిందుస్థాన్ జనతా పార్టీలు తమ కామన్ గుర్తులు కోల్పోయాయి.

దీనికి కారణం.. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం పది శాతం సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ పార్టీలకు కామన్ గుర్తుల్ని తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనిజనసేన భావించటమే కాదు.. అందుకు తగ్గట్లు కసరత్తు చేసింది కూడా.

పవన్ పార్టీ బరిలో ఉంటే.. తమ ఓట్లు చీలే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ కోరటంతో.. పవన్ ఓకే చెప్పి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ఇప్పుడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. త్వరలో ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్లకు ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకు గాజు గ్లాసును కామన్ సింబల్ గా కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా.. తాము పోటీ నుంచి తప్పుకున్నామని.. తమకు తమ గాజు గ్లాస్ ను కామన్ సింబల్ గా కేటాయించాలని రిక్వెస్టు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. జనసేన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవటంతో రిజెక్టు చేసినట్లుగా పేర్కొంది. దీంతో..2025 నవంబరు 18 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ కు ఈ సమాచారం కచ్ఛితంగా షాకిచ్చేదని చెప్పక తప్పదు.