Begin typing your search above and press return to search.

ప‌బ్బం కోసం స‌బ్బం!... అడ్డంగా బుక్కైన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   4 May 2019 4:26 AM GMT
ప‌బ్బం కోసం స‌బ్బం!... అడ్డంగా బుక్కైన‌ట్టేనా?
X
స‌బ్బం హ‌రి... కాంగ్రెస్ పార్టీ నేత‌గానే అంద‌రికీ ప‌రిచ‌యం. 2009లో అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన హ‌రి... విజ‌యం సాధించారు. అయితే ఎన్నిక‌లు ముగిసిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అకాల మ‌ర‌ణంతో స‌బ్బం హ‌రి పొలిటిక‌ల్ కెరీర్ డోలాయ‌మానంలో ప‌డిపోయింది. ఆ త‌ర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నిక‌ల వ‌ర‌కూ కాంగ్రెస్ లోనే కొన‌సాగినా... చివ‌రి నిమిషంలో అప్ప‌టి సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్టీలో చేరిపోయారు. అదే పార్టీ టికెట్ పై 2014 ఎన్నికల్లో విశాఖ లోక్ స‌భ స్థానం నుంచి బ‌రిలోకి దిగి ఓట‌మిపాల‌య్యారు.

ఆ త‌ర్వాత టీడీపీకి ద‌గ్గ‌ర‌గా జ‌రిగిన స‌బ్బం... ఈ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిపోవ‌డంతో పాటుగా విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నుంచి బ‌రిలోకి దిగారు. భీమిలిపై మంచి ప‌ట్టున్న వైసీపీ నేత అవంతి శ్రీ‌నివాస్ పై గెల‌వాలంటే ఏదో ఒక‌టి చేయాల్సిందే. అదే రీతిన ఆలోచించిన స‌బ్బం... పోస్ట‌ల్ బ్యాలెట్ ను కొనుగోలు చేసేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అడ్డంగా బుక్కైపోయార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకునే ఓట‌ర్లను ప్ర‌లోభ‌పెట్టే క్ర‌మంలో ఆయ‌న న‌డిపిన మంత్రాంగం మొత్తం ఆడియోల రూపంలో విప‌క్ష వైసీపీ చేతికి చిక్కిపోయింది.

ఎక్క‌డున్నా త‌న ప‌బ్బం గ‌డుపుకునేందుకే ప్రాధాన్యం ఇస్తార‌ని స‌బ్బంపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న వైసీపీ... ఆధారాలు దొరికిన వెంట‌నే నేరుగా స‌బ్బంపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేలా వ్య‌వ‌హ‌రించిన స‌బ్బంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు స‌బ్బం ప్ర‌లోభాలకు సంబంధించిన ఆడియో టేపుల‌ను కూడా ఈసీకి స‌మ‌ర్పించారు. మొత్తంగా ఈ ఆడియో టేపుల ద్వారా స‌బ్బంపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.