Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఈసీ

By:  Tupaki Desk   |   10 April 2019 10:44 AM GMT
సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఈసీ
X
ఎన్నికల సంఘం తీరుపై పలువురు వేలెత్తి చూపించేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరి ఆరోపణలపై కొరడా ఝుళిపిస్తున్న ఈసీ.. మరికొందరి ఫిర్యాదుల్ని అస్సలు పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అధికారపక్షంపై కాంగ్రెస్ నేతలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్ని ఆరోపణలు చేసినా.. పిర్యాదులు చేసినా ఫలితం పెద్దగా లేదన్న మాట వినిపించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అరే.. కేసీఆర్ సారు వారికి నోటీసులా? ఆయన ఎలాంటి పొరపాటు మాట మాట్లాడలేదన్న సందేహం రావొచ్చు. కేసీఆర్ కు జారీ అయిన నోటీసులు.. తాజాగా చేసిన వ్యాఖ్యలకు కాదు.. ఆ మధ్య హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కావటం గమనార్హం.

ఆ మధ్యన హిందువులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయంటూ విశ్వ హిందూ పరిషత్ ఆరోఫించిన విషయం తెలిసిందే. కరీంనగర్ లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. హిందువులను ఉద్దేశిస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారన్నారు. మార్చి 17న జరిగిన సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ తాజాగా సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12 సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. అంతా బాగుంది కానీ.. అప్పుడెప్పుడో మార్చి 17న ఫిర్యాదు చేస్తే.. ఏప్రిల్ 10న స్పందించటం ఏమిటి? 12న వరకూ వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వటం ఏమిటో? అన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.