Begin typing your search above and press return to search.

మోదీ అసలు బీసీయే కాదు - మాయావతి

By:  Tupaki Desk   |   26 April 2019 4:19 PM GMT
మోదీ అసలు బీసీయే కాదు - మాయావతి
X
ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలకు అంతే ఉండదు. అవతలి వ్యక్తిని ఇరకాటంలో పెట్టేందుకు ఎలాంటి కామెంట్లు అయినా చేస్తుంటారు. అవన్నీ నిజమా కాదా అనే విషయం పక్కనపెడితే.. ఎవరిపై ఎవరు పైచేయి సాధించారు అనేదే ప్రధానంగా అందరూ ప్రస్తావించుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో.. సాధ్యమైనంతగా తనను తాను ఎక్స్‌పోజ్‌ చేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. అందుకే నామినేషన్‌ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించారు. రెండు రోజుల పాటు హడావుడి చేశారు.

మీడియాలో రెండు రోజుల నుంచి మోదీ చేస్తున్న హడావుడికి బీఎస్పీ అధినేత్రి మాయావతి తనదైన రేంజ్‌ లో కౌంటర్‌ ఇచ్చారు. మోదీ తనకు తాను ఒక బీసీనని చెప్పుకుంటారని.. కానీ అసలు మోదీ బీసీయే కాదని బాంబు పేల్చింది. కేవలం బీసీల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చేందుకే.. ఆయన ప్రభుత్వం గుజరాత్‌ లో అధికారంలో ఉన్న సమయంలో.. తన కులాన్ని బీసీగా మార్చుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అందరికి తెలుసు అని కూడా ఆమె అన్నారు.

యూపీలోని జలౌన్‌ లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ టార్గెట్‌ గా విమర్శలు చేశారు. మోదీకి బీసీ ఓట్ల మీద మాత్రమే ప్రేమ అని, బీసీలపై ఉండదని ఎద్దేవా చేశారు. మోదీ నిజంగానే బీసీల సంక్షేమ కోరుకునే వారయితే - దేశంలో బీసీల పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉండేది కాదని అన్నారు. చౌకీదార్‌ అంటూ మోదీ చేస్తున్నవన్నీ గారడీలేనని.. అవన్నీ ఎన్నికల్లో చెల్లవు అని అన్నారు. చివరకు గంగామాత కూడా బీజేపీ పట్ల సంతోషంగా లేదని, ఈ ఎన్నికల్లో గంగామత ఆశీర్వాదం వారికి లభించదని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, ఎస్పీ కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుందని మాయావతి ప్రకటించారు.