Begin typing your search above and press return to search.

ఓట్ల కొనుగోలు:లారీల‌తో గిఫ్ట్‌ లు..కార్ల‌లో నోట్లు

By:  Tupaki Desk   |   1 April 2018 4:44 AM GMT
ఓట్ల కొనుగోలు:లారీల‌తో గిఫ్ట్‌ లు..కార్ల‌లో నోట్లు
X
పొరుగు రాష్ట్రమైన కర్ణాట‌క‌లో జోరుగా ఓట్ల కొనుగోలు ఎత్తుగ‌డ‌లు మొద‌ల‌య్యాయి. త్వరలో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాల్లో భాగంగా గిఫ్ట్‌ లు - నోట్లు అందించేందుకు ప్ర‌య‌త్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఓటర్లకు పంచడానికి తరలిస్తున్న ప్రెషర్ కుక్కర్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇల్కాల్ నుంచి బాగల్‌ కోట్‌ కు కారులో రూ.54 లక్షలు తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్న దాదాపు రూ.10.2 లక్షల విలువగల(రూ.2వేల నోట్లు) నకిలీ నోట్లను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా నకిలీ నోట్లను మార్పిడి చేయడానికి ఎక్కువ అవకాశాలున్న నేపథ్యంలో ఈ నోట్లను తరలిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఓటర్లకు తాయిలంగా ఇచ్చేందుకు వెళ్తున్న ప్రెషర్ కుక్కర్‌ లతో కూడిన ఓ లారీ బెలగావిలో పట్టుబడింది. ప్రెషర్ కుక్కర్లపై స్థానిక కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బాల్కర్ పేరు న్న స్టిక్కర్లు ఉండటంతో బీజేపీ నేతలు ఎన్నికల అధికారులు - పోలీసులకు ఫిర్యాదు చేశారు. `ఒక వ్యక్తి అందించిన సమాచారం మేరకు ప్రెషర్ కుక్కర్లను తీసుకెళ్తున్న మినీ ట్రక్కును గుర్తించి నిలిపాం. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. వారు చాలా ఆలస్యంగా ట్రక్కు వద్దకు చేరుకున్నారు` అని బీజేపీ నేత అనిల్ బెనకే తెలిపారు. కాగా, సంఘటనా స్థలానికి వచ్చిన లక్ష్మీ హెబ్బాల్కర్ సోదరుడు చెన్నరాజ్ స్థానిక బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ ప్రెషర్ కుక్కర్లు తనవేనని - తన కంపెనీలోనే తయారయ్యాయని చెన్నరాజ్ తెలిపారు. ప్రెషర్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు.

ఇదిలాఉండ‌గా..హౌరా నుంచి హైదరాబాద్‌ కు వెళ్తున్న ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ ప్రెస్ రైలులో నకిలీ నోట్లను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఆర్‌ ఐ అధికారులు విశాఖపట్నం వద్ద తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు రూ.10.2 లక్షల విలువ గల (రూ.2వేల నోట్లు) నకిలీ నోట్లను పేపర్లలో చుట్టి దిండులో దాచగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిపై ఇప్పటికే కిడ్నాప్ కేసు ఉన్నది. డీఆర్‌ ఐ అధికారులు మాట్లాడుతూ నకిలీ నోట్లను బంగ్లాదేశ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి ఓ వ్యక్తి ఈ నోట్లను తీసుకొచ్చి పశ్చిమబెంగాల్‌ లోని ఫరక్కా వద్ద ఇద్దరు నిందితులకు అందజేశాడని - వారు కర్ణాటకకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ కరెన్సీని పాకిస్థాన్‌ లో ముద్రించి ఉండొచ్చని - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.