Begin typing your search above and press return to search.

చంద్రబాబు టీంలో దొంగ ఉన్నాడు.. ఈసీ

By:  Tupaki Desk   |   14 April 2019 4:09 AM GMT
చంద్రబాబు టీంలో దొంగ ఉన్నాడు.. ఈసీ
X
ఎలక్షన్ కమిషన్‌ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న చంద్రబాబునాయుడికి ఆ కమిషన్ భారీ షాకిచ్చింది. మీరే కాదు మేం కూడా ఆరోపణలు చేయగలం.. అది కూడా ఆధారాలతో సహా అన్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖ కూడా రాసింది.

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈసీ పూర్తిగా విఫలమైందని - విశ్వసనీయత కోల్పోయిందంటూ చంద్రబాబునాయుడు ఆరోపిస్తుండడం.. దీనిపై ఆయన ఈ రోజు దిల్లీ వచ్చి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి కంప్లయింట్ చేయడం తెలిసిందే. చంద్రబాబు ఎప్పుడు దిల్లీ వచ్చినా భారీ టీంతో వస్తుంటారు.. ఈసారి కూడా ఆయన సుమారు 20 మందిని వెంట తీసుకుని వచ్చి ఈసీని కలిశారు. మొత్తం 18 అంశాల మీద చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అందులో ఈవీఎంల మొరాయింపు కూడా ప్రధానమైంది.

దీంతో ఈవీఎంలకు సంబంధించి టీడీపీకి ఉన్న అభ్యంతరాలను తెలిపేందుకు ప్రత్యేకంగా భేటీని ఈసీ ఏర్పాటు చేసి టీడీపీ సాంకేతిక నిపుణులను పంపాలని సూచించింది. సాయంత్రం 4 గంటలకు ఆ భేటీ ఉంటుందని తెలిపింది. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (ఇన్‌ చార్జి - ఈవీఎం విభాగం) సుదీప్ జైన్ - టెక్నికల్ ఎక్స్‌ పర్ట్ కమిటీ చైర్మన్ డీటీ సహానీ (ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్) వద్ద టీడీపీకి సంబంధించిన సాంకేతిక నిపుణులను పంపి వివరాలు తెలపాల్సిందిగా సూచించింది.

అయితే... ఈ సమావేశానికి టీడీపీ తరఫున హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడు హాజరయ్యారు. ఈసీ ఆయన విషయంలో అభ్యంతరం వ్యక్తంచేసింది. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌‌ కు రాసిన లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. హరిప్రసాద్‌ పై 2010లో ఈవీఎం మెషిన్‌ దొంగతనం ఆరోపణలు ఉన్నాయని.. 2010 మార్చి 13న ముంబైలోని ఎంఆర్‌ ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌ లో క్రిమినల్ కేసు కూడా నమోదైందని ఈసీ ఆరోపించింది. ఆ కేసు విచారణ ఏమైనప్పటికీ - ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం కరెక్టు కాదని చెబుతూ.. హరిప్రసాద్‌ పై కేసుకు సంబంధించిన గూగుల్‌ లో ఉన్న సమాచారం.. ఫొటోలను కూడా ఆ లేఖతో జత చేసింది. దీంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.