Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో బాబు బ్యాచ్‌ కు ఈసీ షాక్‌

By:  Tupaki Desk   |   19 Aug 2017 7:54 AM GMT
నంద్యాల‌లో బాబు బ్యాచ్‌ కు ఈసీ షాక్‌
X
నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో బాబు బ్యాచ్ కు భారీ షాక్ త‌గిలింది. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిని కంట్రోల్ చేసే వ్య‌వ‌స్థ‌లు ప్ర‌జాస్వామ్యంలో ఉంద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. బాబు బ్యాచ్‌ కు త‌న‌దైన రీతిలో సాయం చేస్తున్న పోలీసు ఉన్న‌తాధికారిపై బ‌దిలీ వేటు వేసింది ఎన్నిక‌ల సంఘం.

పోటాపోటీగా సాగుతున్న నంద్యాల ఉప ఎన్నిక‌లో త‌న అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించుకోవ‌టం కోసం ఏపీ అధికార‌ప‌క్షం చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. అధికారాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనంపై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నంలో భాగంగా విచ్చ‌ల‌విడిగా డ‌బ్బుల్ని పంచుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాటు.. వివిధ తాయిలాల‌తో ఓట‌ర్ల‌ను మ‌భ్య పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. త‌మ అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించుకునేందుకు.. త‌మ చేతిలో ఉన్న అధికారాన్ని ఉప‌యోగించి పోలీసుల్ని ప్ర‌యోగిస్తున్న తీరుపై విపక్షం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. పోలీసుల్ని ప్ర‌యోగించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌ల్ని.. కార్య‌క‌ర్త‌ల్ని ఇబ్బంది పెడుతుంద‌న్న విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

దీనిపై స్పందించిన ఏపీ ఎన్నిక‌ల సంఘం నంద్యాల డీఎస్పీ గోపాల‌కృష్ణ‌ పై బ‌దిలీ వేటు వేసింది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఈ ఆదేశాల్ని జారీ చేసింది. డీఎస్పీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. జ‌గ‌న్ పార్టీకి చెందిన చిన్నాచిత‌కా నాయ‌కుల ఇళ్ల‌పై అర్థ‌రాత్రి సోదాలు చేసేందుకు త‌లుపులు త‌డుతున్న తీరుపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి.

దీనిపై స్పందించిన ఎన్నిక‌ల సంఘం డీఎస్పీని బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. గోపాల‌కృష్ణ స్థానంలో ఓఎస్డీ ర‌విప్ర‌కాశ్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. అదే స‌మ‌యంలోనంద్యాల ఉఎప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముగ్గురు ప‌రిశీల‌కుల్ని ఈసీ నియ‌మించింది.

ఒక ఉప ఎన్నిక‌కు ఇంత‌మంది ప‌రిశీల‌కుల్ని ఎన్నిక‌ల సంఘం నియ‌మించ‌టం చూస్తే.. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్రాధాన్య‌త‌.. ప్రాముఖ్య‌త‌ను ఈసీ సైతం గుర్తించింద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. తాజా ప‌రిణామాలు ఏపీ అధికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మార‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.