Begin typing your search above and press return to search.

మోదీకీ ఈసీ షాక్ త‌ప్ప‌లేదే!

By:  Tupaki Desk   |   4 April 2019 4:37 AM GMT
మోదీకీ ఈసీ షాక్ త‌ప్ప‌లేదే!
X
ఎన్నిక‌ల వేళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం సుప్రీం బాస్ కిందే లెక్క‌. ఇటు రాష్ట్రాల్లో అయినా, అటు కేంద్రంలో అయినా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ చెప్పిందే వేదంగా జ‌రిగి తీరాల్సిందే. ప్ర‌జాస్వామ్య దేశంలో ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాలంటే... ఎన్నిక‌ల సంఘానికి ఈ మేర మొత్తం వ్య‌వ‌స్థ‌ల‌పై అదుపు త‌ప్ప‌నిస‌రి అంటూ రాజ్యాంగం ఎప్పుడో తేల్చి చెప్పింది. వెర‌సి దేశంలో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైందంటే... ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేస్తుంది. అప్ప‌టిదాకా చ‌క్రం తిప్పిన ప్ర‌భుత్వాలు.. కోడ్ రాగానే కోర‌లు పీకిన పాముల్లా మార‌క త‌ప్ప‌దు. ఇలాంటి ప‌రిస్థితికి అద్దం ప‌ట్టే ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఇప్పుడు చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా తొలి విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ప్ర‌చారం హోరెత్తుతోంది. ఇలాంటి కీల‌క త‌రుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఎన్నిక‌ల సంఘం బిగ్ షాకే ఇచ్చింద‌ని చెప్పాలి.

నిన్న‌టిదాకా లేనిది... ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ‌... న‌మో టీవీ ఛానెల్‌ ను ఎలా ప్రారంభిస్తారంటూ నేరుగా ప్ర‌ధానినే ప్ర‌శ్నించేసింది ఎన్నిక‌ల సంఘం. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ఏకంగా నోటీసులు జారీ చేసింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న విష‌యాన్ని కూడా విస్మ‌రిస్తారా? అంటూ మోదీ స‌ర్కారును నిల‌దీసేసింది. ఈ వ్య‌వ‌హారంలో అస‌లు ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ నమో టీవీ ప్రారంభించేసింది. దీనిపై భ‌గ్గుమ‌న్న‌ ఆమ్ ఆద్మీ పార్టీ - కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఈసీ... కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను వివరణ కోరింది.

అంత‌టితో ఆగ‌ని ఈసీ... కేంద్రంతో పాటుగా కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంని దూరదర్శన్ కు కూడా నోటీసులు జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ తాఖీదు జారీ చేసింది. మొత్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు - వారి మ‌న‌సును మార్చేందుకు ఎవ‌రు ఎలాంటి య‌త్నం చేసినా స‌హించేది లేదంటూ కొర‌డా ఝుళిపించేసింది. మ‌రి ఈ త‌ర‌హా వివాదం నుంచి మోదీ స‌ర్కారు ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో, ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.