Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఫోన్ ట్యాపింగ్ ర‌చ్చ మ‌ళ్లీ మొద‌లు!

By:  Tupaki Desk   |   27 Oct 2018 8:02 AM GMT
తెలంగాణ‌లో ఫోన్ ట్యాపింగ్ ర‌చ్చ మ‌ళ్లీ మొద‌లు!
X
ఫోన్ ట్యాపింగ్ అన్నంత‌నే తెలుగు ప్ర‌జ‌ల‌కు గుర్తుకొచ్చేది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే. ఓటుకు నోటు కేసులో బాబు గొంతు బ‌య‌ట‌కు రావ‌టం.. ఆ టేప్ లో ఉన్న‌ది బాబు గొంతేనా? కాదా? అన్న అంశంపై అధికారికంగా తేల్చ‌క‌పోవ‌టం తెలిసిందే. నిజానికి ఈ ఇష్యూ బ‌య‌ట‌కు రాగానే డిఫెన్స్ లో ప‌డిన బాబు.. తెలంగాణ‌లో త‌న ముఖాన్ని చూపించ‌కుండా.. త‌న దారిన తాను అమ‌రావ‌తికి వెళ్లిపోవ‌టం తెలిసిందే.

త‌న‌పై ప‌డిన ఓటుకు నోటు మురికిని వ‌దిలించుకోవ‌టానికి.. కేసీఆర్ ప్ర‌భుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ నింద వేసిన బాబు.. అప్ప‌టికైతే ఆయ‌న్ను డిఫెన్స్ లో ప‌డేలా చేయ‌గ‌లిగారు. కానీ.. త‌న మీద ప‌డిన ఓటుకు నోటు నింద‌ను క‌డుక్కునే క్ర‌మంలో కేసీఆర్ మీద వేసిన ట్యాపింగ్ ఇష్యూను పెద్ద ర‌చ్చ చేయ‌లేక‌పోయారు.

తాజాగా ఆ విష‌యం గుర్తుకు వ‌చ్చిందేమో కానీ..తాను క‌థ‌.. స్క్రీన్ ప్లే.. ద‌ర్శ‌క‌త్వం వ‌హించే మ‌హ‌కూట‌మికి ట్యాపింగ్ ఐడియాను ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌డిచిన కొద్ది రోజులుగా ట్యాపింగ్ ముచ్చ‌ట‌తో అదే ప‌నిగా మండిప‌డుతున్న కూట‌మి మిత్రులు తాజాగా ఇదే అంశాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ స‌ర్కారు త‌మ ఫోన్ల‌ను ట్యాప్ చేస్తుంద‌ని ఆరోపించారు. ఈ ఆరోప‌న‌లు చేసిన వారిలో ఉత్త‌మ్‌.. చాడ‌.. కోదండం సారుతో పాటు ర‌మ‌ణ‌లు ఉన్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు కూట‌మి నేత‌లు. దీంతో.. వీటిని సీరియ‌స్ గా తీసుకున్న ఈసీ.. ట్యాపింగ్ విష‌యంపై తెలంగాణ స‌ర్కారును వివ‌ర‌ణ కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలో ఏయే నాయ‌కుల ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నారు..? ఎప్ప‌టి నుంచి చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? లాంటి వివ‌రాల్ని త‌మ‌కు అందివ్వాల‌ని కోరారు. అయినా.. ఈసీ అడిగినంత‌నే అన్ని వివ‌రాలు ఎంచ‌క్కా ఇచ్చేస్తారా? అన్న క్వ‌శ్చ‌న్ ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఏమైనా.. ట్యాపింగ్ ముచ్చ‌ట తాజాగా కేసీఆర్ ను కాసింత డిఫెన్స్ లో ప‌డేసిన‌ట్లుగా తెలుస్తోంది.