Begin typing your search above and press return to search.

ఆ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ

By:  Tupaki Desk   |   7 Feb 2022 5:31 AM GMT
ఆ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ
X
దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికలకు ఊపుగా వెళుతున్న పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. వాటికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో కరోనా.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల రోడ్ షోలు, పాదయాత్రలపై నిషేధాన్ని కొనసాగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులకు గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 11వ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

కాగా బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాల నిర్వహణకు మరిన్ని సడలింపులు కల్పించింది. అధికారుల అనుమతితో నిర్ణీత ప్రదేశాల్లో బహిరంగ సభలకు 1000 మందికి అనుమతించింది. లేదా సభా ప్రాంగణంలో 50 కెపాసిటీ ఉండొచ్చని పేర్కొంది. అలాగే.. ఇంటింటి ప్రచారానికి 20 మంది వరకూ బృందంగా వెళ్లొచ్చని స్పష్టం చేసింది. ఇండోర్ లో జరిగే సమావేశాలకు గతంలో 300 మందికి మించరాదని పరిమితి విధించిన ఈసీ.. ఈసారి ఆ సంఖ్యను 500 వరకూ పెంచింది. లేదా 50శాతం సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉండాలంది.

ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ ఆ వ్యాప్తిని మళ్లీ పెంచకూడదనే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. నేతలు కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనలను ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్రలు ఈ మేరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఓ ప్రకటనలో పేర్కొన్నారు.