Begin typing your search above and press return to search.

ఈసీ కొర‌డా!... జిల్లా క‌లెక్ట‌ర్‌ పై వేటు!

By:  Tupaki Desk   |   9 Feb 2019 5:10 PM GMT
ఈసీ కొర‌డా!... జిల్లా క‌లెక్ట‌ర్‌ పై వేటు!
X
దేశంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయంటే... కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఎక్క‌డ లేని అధికారాలు వ‌చ్చేస్తాయి. అప్ప‌టిదాకా అటు కేంద్రంలో గానీ, ఇటు రాష్ట్రాల్లో గానీ ఆయా ప్ర‌భుత్వాల కిందే ప‌నిచేసే అధికారులు ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిందంటే.. ఒక్క‌సారిగా ఈసీ ప‌రిధిలోకి వ‌చ్చేస్తారు. అధికార పార్టీల‌కు ఏమాత్రం త‌లొగ్గ‌కుండా ఎన్నిక‌లు స‌జావుగా నిర్వ‌హించేందుకే భారత రాజ్యాంగం ఈ మేర‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అస‌లు రాజ‌కీయ పార్టీల‌కు అల్లంత దూరంలో ఉండే అధికార గ‌ణం... కేవ‌లం ఎన్నిక‌ల సంఘం నిర్దేశాల‌ను మాత్ర‌మే పాటించాలి. అంతేకాదు... ఎప్ప‌టికప్పుడు ఏమేం జ‌రుగుతుందో కూడా నేరుగా ఈసీకే నివేదించాలి. ఈ విష‌యంలో ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా... ఈసీ చేప‌ట్టే చ‌ర్య‌లు చాలా క‌ఠినంగా ఉంటాయి. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగిసినా... ఓ క‌లెక్ట‌ర్ చేసిన ప‌ని ఆయ‌న‌ను ఏకంగా సస్పెండ్ చేసేసింది.

తెలంగాణ‌లోని వికారాబాద్ క‌లెక్ట‌ర్ స‌య్య‌ద్ ఉమ‌ర్ జ‌లీల్ ఇప్పుడు పెద్ద ఇర‌కాటంలోనే చిక్కుకున్నారు. ముందుగా ఈసీ సంధించిన కొర‌డాకు స‌స్పెన్ష‌న్ వేటు వేయించుకున్న జ‌లీల్‌... మున్ముందు ఎంత మేర ఇబ్బంది ప‌డ‌తారో చూడాలి. అస‌లు ఈ ఉదంతంలో ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ నేత‌లు ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశార‌ని, ఈ కార‌ణంగానే తాము ఓట‌మిపాల‌య్యామ‌ని, ఈ క్ర‌మంలో త‌మ అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు ఈవీఎంల‌లోని వీవీ ప్యాట్‌ల‌ను మ‌రోమారు ప‌రిశీలించాల్సిందేన‌ని కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు కోర్టులో న‌డుస్తోంది. అయితే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు మొద‌లైన త‌రుణంలో పాత ఈవీఎంల‌నే వినియోగించాల‌ని ఈసీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ఈవీఎంల ప‌రిశీల‌న‌కు బీహెచ్ఈఎల్ అధికారులు రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా త‌న వ‌ద్ద‌కు వచ్చిన బీహెచ్ఈఎల్ అధికారుల‌కు స‌హ‌క‌రించిన జ‌లీల్ ఈవీఎంల‌ను పరిశీలించేందుకు అనుమ‌తించారు. ఇక్క‌డే ఆయ‌న పెద్ద ప్ర‌మాదంలో ప‌డిపోయారు. కోర్టులో కేసులు ఉన్న ననియోజ‌క‌వ‌ర్గాలకు సంబంధించిన ఈవీఎంల‌ను ఓపెన్ చేయ‌డం కుద‌ర‌దు. కోర్టు గానీ, ఈసీ గానీ అనుమ‌తిస్తేనే అది సాధ్య‌మ‌వుతుంది. కోర్టులు కూడా కేసులు తేలేదాకా స‌ద‌రు ఈవీఎంల‌ను ముట్టుకోవ‌ద్ద‌ని ఆదేశాలు ఇస్తుంది. అయితే ఇవేవీ ప‌ట్ట‌ని జ‌లీల్‌... బీహెచ్ఈఎల్ అధికారులు రాగానే... ఈవీఎంల ప‌రిశీల‌న‌కు అనుమ‌తించారు. విష‌యం తెలిసిన ఈసీ... జ‌లీల్ చ‌ర్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా అప్ప‌టిక‌ప్పుడే ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. అంతేనా... ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేసింది. మ‌రి ఈ విచార‌ణ‌లో జ‌లీల్ ఏ మేర‌కు బ‌య‌ట‌ప‌డతారో చూడాలి.