Begin typing your search above and press return to search.

1262 ఓట్లకు ఇప్పుడన్నవి 393 మాత్రమే

By:  Tupaki Desk   |   1 Nov 2015 4:13 AM GMT
1262 ఓట్లకు ఇప్పుడన్నవి 393 మాత్రమే
X
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలగించిన ఓటర్లు ఎంత భారీగా ఉన్నారన్నది కేంద్ర ఎన్నికల సంఘం పంపిన బృందం పరిశీలనలో వెల్లడైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అధికారులు కొన్ని బృందాలు ఏర్పడి ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. కొందరు ఓటర్ల దగ్గరకు నేరుగా వెళ్లి మాట్లాడితే.. మరికొందరు రాజకీయ పార్టీల వాదనను వినే అంశంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. గ్రేటర్ పరిధిలోని మొత్తం ఓట్లలో దాదాపు 6.30లక్షల ఓట్లు తొలగించారు. వీటికి అధికారులు చెబుతున్న వాదనకు.. క్షేత్ర స్థాయి మధ్యనున్న వైఖరికి సంబంధం లేదన్న వాదన ప్రముఖంగా వినిపించింది.

శనివారం ఎన్నికల సంఘానికి చెందిన ప్రతినిధులు జూబ్లీహిల్స్.. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని కృష్ణానగర్ బి.. సి.. బ్లాకులలో పరిశీలించారు. ఈ బ్లాకులు పరిశీలించటానికి ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలోని 185 పోలింగ్ కేంద్రానికి సంబంధించి మొత్తం ఉండాల్సిన ఓట్లు 1262 కాగా.. ప్రస్తుతం ఉన్న ఓట్లు 393 ఉన్నట్లే గుర్తించారు. మిగిలినవి ఏ ప్రాతిపదికన ఓట్లు తీసేశారన్న ప్రశ్నకు గ్రేటర్ అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించని పరిస్థితి.

ఇక.. ఎన్నికల సంఘం అధికారులు ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా తాము ఏళ్ల కొద్దీ ఉన్నామని.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ ఓటును తీసేశారని పేర్కొన్నారు. మరికొందరు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము ఓటు వేశామని.. ఇప్పుడు మాత్రం ఓటు తీసేశారని ఆరోపించారు. ఇంకొందరైతే తాము దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో ఉన్నా కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఓట్లు తీసేసారంటూ వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రజలు చెప్పే మాటల్ని విన్న ఎన్నికల సంఘం అధికారులు.. గ్రేటర్ అధికారుల్ని పలు ప్రశ్నలు సంధించారు. కొన్ని సందర్భాల్లో తప్పు జరిగిందని.. వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని చెప్పటం గమనార్హం. మొత్తంగా గ్రేటర్ లో ఓట్ల తొలగింపు వ్యవహారంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఎన్నికల సంఘానికి భారీ ఫీడ్ బ్యాక్ దొరికిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.