Begin typing your search above and press return to search.

గులాబీ త‌ప్పించి ప్ర‌పంచంలో మ‌రో రంగే లేదా?

By:  Tupaki Desk   |   28 Oct 2018 5:08 AM GMT
గులాబీ త‌ప్పించి ప్ర‌పంచంలో మ‌రో రంగే లేదా?
X
ధ‌ర్మ కాంటాం మాదిరి ఎన్నికల వేళ‌.. ఈసీ అటూ ఇటూ మొగ్గ‌కుండా మ‌ధ్య‌స్తంగా ఉండాలి. ఏ పార్టీ అయినా త‌మ‌కు ఒక‌టే అన్న రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం చాలా అవ‌స‌రం. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై అభ్యంత‌రాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా మ‌హిళ‌ల కోసం ఏర్పాటు చేసే పోలింగ్ బూత్ ల‌ను మొత్తంగా గులాబీ రంగుతో నింప‌టంపై ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎవ‌రో ఏదో చేయ‌టం వేరు.. అంద‌రిని స‌మానంగా చూడాల్సిన ఈసీపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌ లో మంచి వాగ్దాటి ఉన్న నేత‌ల్లో దాసోజు శ్ర‌వ‌ణ్ ఒక‌రు. తాజాగా ఆయ‌న గులాబీ రంగుపై ఈసీ ప్ర‌ద‌ర్శిస్తున్న మోజును ఆయ‌న ప్ర‌స్తావించారు.

ప్ర‌పంచంలోమ‌రో రంగే లేన‌ట్లుగా ఎన్నిక‌ల బూత్‌ల‌కు.. బ్యాలెట్ పేప‌ర్ల‌కు గులాబీ రంగు వాడాల్సిన అవ‌స‌రం ఏమిటంటూ నిల‌దీస్తున్నారు. తెలంగాణ‌ రాష్ట్రంలో ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌వ‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరేలా అక్టోబ‌రు 26న విడుద‌లైన సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ జారీ చేసిన మెమో నం.1605 చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు.

9 ల‌క్ష‌ల ఈవీఎం బ్యాలెట్ పేప‌ర్ల‌ను ఈ ఉత్త‌ర్వుల‌లో ప్రింట్ చేయ‌మ‌ని ఉంద‌ని.. అధికార పార్టీకి చెందిన గులాబీ రంగులో వాటినెలా ప్రింట్ చేస్తారంటూ దాసోజు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.

ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలంగాణ అధికార‌ప‌క్షానికి తాబేదార్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా ఫైర్ అయ్యారు. ఈసీ తీరు చూస్తుంటే రాజ్యాంగ‌బ‌ద్ధంగా.. స్వేచ్చ‌గా ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న భావ‌న క‌ల‌గ‌టం లేదంటున్నారు. కాంగ్రెస్ నేత‌ల వాహ‌నాల్నే ఆపుతున్నార‌ని.. త‌నిఖీల పేరుతో వేధిస్తూ.. పాత కేసుల్ని తిర‌గ‌తోడే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఈసీ మీద దాసోజు ఓపెన్ గా విరుచుకుప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. మ‌రీ.. ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టి సారిస్తుందో? లేదో చూడాలి.