Begin typing your search above and press return to search.

ఆ రెండు పార్టీల మ‌ధ్య గ‌ణేషుడి గ‌లాట‌!

By:  Tupaki Desk   |   1 Sep 2019 5:18 AM GMT
ఆ రెండు పార్టీల మ‌ధ్య గ‌ణేషుడి గ‌లాట‌!
X
వినాయ‌క చ‌వితి వ‌చ్చేసింది... కొత్త వివాదాల‌ను తెచ్చేసింది.. అది రాజ‌కీయ మ‌త‌ప‌ర‌మైన సరికొత్త వాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితులు ఇప్పుడు తెలంగాణ‌లో క‌నిపిస్తున్నాయి. విఘ్నాలు తొల‌గించే వినాయ‌కుడే.. ఇప్పుడు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య చిచ్చుకు కార‌ణం అవుతుండ‌డంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి మాత్రం న‌వ‌రాత్రులు.. దిన‌దిన‌గండంగా మారే ప‌రిస్థితులు కూడా లేక‌పోలేద‌ని ప్ర‌జ‌ల్లోనూ ఆందోళ‌న మొద‌లైంది.

ఇంత‌కీ గ‌ణేషుడి చుట్టూ వివాదాలు ఎలా మొద‌ల‌య్యాయో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.. కొంత‌కాలంగా.. మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌నే ప్ర‌తిష్ఠిద్దాం.. పూజిద్దాం.. ప‌ర్య‌వ‌ర‌ణాన్ని కాపాడుకుందాం.. అనే నినాదం వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో సిద్దిపేట జిల్లాలో ఊరికి ఒక్క‌డే వినాయ‌కుడు నినాదం మొద‌లైంది. గ్రామానికి ఒక్క వినాయక విగ్రహాన్నే ప్రతిష్టించాలంటూ సిద్దిపేట జిల్లాలో కొందరు ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి హరీష్‌ రావు కూడా తన మద్దతు ప్ర‌క‌టించారు. అంతేగాకుండా.. అలా చేసిన గ్రామాల‌కు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు కూడా ఇస్తానంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు.

జిల్లాలోని పలు గ్రామాలు కూడా స్వచ్చందంగా ముందుకు రావ‌డం.. తీర్మానాలు చేయ‌డం జ‌రిగిపోయాయి. ఇలా అక్క‌డ మొద‌లైన గ్రామానికి ఒక్క విగ్ర‌హ‌మే నినాదం.. క్ర‌మంగా ప‌క్క జిల్లాల‌కు కూడా పాకింది. స‌రిగ్గా ఇక్క‌డే క‌మ‌ల‌ద‌ళం రంగంలోకి దిగింది. ఇది హిందూ పండుగ‌ల‌ మీద దాడి అంటూ విమ‌ర్శ‌ల‌కు దిగింది. హిందువుల పండుగ‌ల‌ను అణ‌చివేయ‌డానికే కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నారంటూ బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఐక్య‌త‌ను నెల‌కొల్పే వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఊరికి ఒక్క‌టే ప్ర‌తిష్ఠించాల‌ని చెప్ప‌డం దారుణ‌మ‌ని ఖండిస్తున్నారు.

ఇదిలా.. ఉండ‌గా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తున్న క‌మ‌ల‌ద‌ళం.. ఏ చిన్న అవ‌కాశం దొరికినా.. వ‌దిలిపెట్ట‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే.. ఊరికి ఒక్క వినాయ‌క విగ్ర‌హ‌మ‌నే ప్ర‌చారాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తోంది. హిందూ సెంటిమెంట్‌ ను స‌రైన స‌మ‌యంలో తెర‌మీద‌కు తెస్తోంది. ఇలా టీఆర్ ఎస్‌ - బీజేపీల మ‌ధ్య వినాయ‌క చ‌వితి వివాదం జ‌రుగుతుండ‌గానే.. మ‌రికొన్ని పార్టీలు మ‌రోరాగం అందుకున్నాయి. వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రులు ముగిసేవ‌ర‌కూ.. మ‌ద్యం షాపులు బంద్ చేయాల‌ని ఎక్సైజ్ కార్యాల‌యాల ముందు వామ‌ప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగుతున్నాయి. అయితే.. బీజేపీ కూడా మ‌ద్యం షాపులు బంద్ చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. నిమ‌జ్జ‌నానికి మూడు రోజుల ముందు నుంచి మ‌ద్యం షాపులు బంద్ చేయాల‌ని అంటోంది. కానీ.. ఇప్ప‌టి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న మాత్రం రావ‌డం లేదు.