Begin typing your search above and press return to search.

ట్రంప్ ఇస్తున్న దాంతో పోలిస్తే మోడీ ఇస్తున్న‌దెంత‌?

By:  Tupaki Desk   |   15 May 2020 6:00 AM GMT
ట్రంప్ ఇస్తున్న దాంతో పోలిస్తే మోడీ ఇస్తున్న‌దెంత‌?
X
లాక్ డౌన్ కార‌ణంగా దేశంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోయాయి. జ‌నాలు ఉపాధి లేక‌, డ‌బ్బులు రాక అల్లాడిపోతున్నారు. అన్ని వ్యాపారాలు, వాణిజ్య కార్య‌క‌లాపాలు, డ‌బ్బు లావాదేవీలు ఆగిపోవ‌డంతో ఆర్థిక సంక్షోభానికి దారి తీసేలా ఉన్నాయి ప‌రిస్థితులు. ఈ నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాలనూ ఆదుకుంటామని, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడ‌తామ‌ని అన్న మోడీ స‌ర్కారు రూ.20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ గురించి చెప్పేస‌రికి అంతా ఆశ‌గా ఎదురు చూశారు. ఇందులో భాగంగా ముందుగా రూ.6 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ వివ‌రాలు వెల్ల‌డించింది. ఐతే ఈ ప్యాకేజీతో త‌మ‌కేదో ఒరిగి పోతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న మ‌ధ్య త‌ర‌గ‌తి జీవులు వివ‌రాలు చూసి నిట్టూర్చేశారు. వారికి దీని వ‌ల్ల జ‌రిగే మేలేమీ లేద‌ని నిపుణులు కూడా చెబుతున్నారు.

ఐతే మ‌న‌తో పోలిస్తే లాక్ డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌ని అమెరికా మాత్రం దేశ ప్ర‌జ‌ల్ని ఆదుకోవ‌డానికి భారీ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. దాని ప్ర‌కారం దేశంలోని ప్ర‌తి పౌరుడికీ 1200 డాల‌ర్లు (దాదాపు రూ.90 వేలు) మేర ప్ర‌యోజ‌నం చేకూరింది. బాగా అభివృద్ధి చెందిన, మ‌న‌తో పోలిస్తే లాక్‌డౌన్‌తో అంత‌గా జ‌నాల్ని ఆర్థికంగా దెబ్బ తీయ‌ని అమెరికానే అంత సాయం అందిస్తుంటే.. రెండు నెల‌లుగా జ‌నాల‌కు ఉపాధి లేకుండా చేసిన, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భార‌త్ ఇంకా ఎక్కువ సాయం చేయాల్సింద‌ని.. అమెరికాతో పోలిస్తే ప‌ది శాతం, అంటే రూ.9 వేల మేర అయినా ప్ర‌తి పౌరుడికీ సాయం అందేలా ప్యాకేజీ ఇచ్చి ఉండాల్సింద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కొన్ని వ‌ర్గాల‌కు మాత్ర‌మే మేలు చేసేలా ప్యాకేజీలు ఉన్నాయ‌ని.. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవుల‌కు ఎలాంటి ఊర‌ట ల‌భించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. కొన్ని దేశాల్లో ప్రైవేటు ఉద్యోగుల‌కు కంపెనీలు 50 శాతం జీతం ఇస్తుంటే.. ప్ర‌భుత్వాలు 50 శాతం భ‌రిస్తున్నాయ‌ని.. పీఎఫ్ భారం మొత్తాన్ని ప్ర‌భుత్వాలు భ‌రిస్తున్నాయ‌ని.. ఆయా దేశాల‌తో పోలిస్తే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేస్తున్న సాయం నామ‌మాత్రం అని నిపుణులు అభిప్రాయ‌ ప‌డుతున్నారు.